194 పరుగుల లక్ష్యఛేదనలో 170 పరుగులకి పరిమితమైన ముంబై ఇండియన్స్... ఆఖరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో రాయల్స్ ‘రాయల్’ విక్టరీ... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో పరాజయాన్ని అందుకుంది. 194 పరుగుల లక్ష్యఛేదనలో ఆఖరి ఓవర్‌ వరకూ పోరాడిన ముంబై ఇండియన్స్, 170 పరుగులకే పరిమితమైంది. 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో విజయాలను అందుకుంది. రాజస్థాన్ రాయల్స్ సాధించిన రెండు విజయాలు కూడా టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసి దక్కించుకున్నవే కావడం విశేషం. 

భారీ లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ వికెట్ త్వరగా కోల్పోయింది ముంబై ఇండియన్స్. 5 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అన్‌మోల్‌ప్రీత్ సింగ్ 5 పరుగులు చేసి నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కలిసి మూడో వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 43 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఐపీఎల్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...

33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ... రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టిమ్ డేవిడ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన యజ్వేంద్ర చాహాల్, ఆ తర్వాతి బంతికే డానియల్ సామ్స్‌ని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి బంతికి మురుగన్ అశ్విన్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో కరణ్ నాయర్ జారవిడిచాడు. 

నాయర్ క్యాచ్ పట్టి ఉంటే యజ్వేంద్ర చాహాల్‌కి హ్యాట్రిక్ దక్కి ఉండేది. విజయానికి 12 బంతుల్లో 39 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ, మూడు వైడ్లు, ఓ నోబాల్‌తో 10 పరుగులు మాత్రమే ఇచ్చి... కిరన్ పోలార్డ్‌ని భారీ షాట్లు ఆడకుండా నియంత్రించగలిగాడు...

దీంతో ఆఖరి ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయానికి 29 పరుగులు కావాల్సి వచ్చింది. మొదటి బంతి వైడ్‌గా రాగా, ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు పోలార్డ్. వరుసగా నాలుగు బంతుల్లో పరుగులు ఇవ్వకుండా నియంత్రించిన నవ్‌దీప్ సైనీ, ఆఖరి బంతికి పోలార్డ్‌ను అవుట్ చేశాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్కు అందుకున్నాడు జోస్ బట్లర్. ఓవరాల్‌గా బట్లర్‌కి ఇది 300వ టీ20 గేమ్ కావడం విశేషం...

కేవిన్ పీటర్సర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన నాలుగో ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్. ఇంతకుముందు బెన్ స్టోక్స్ ఐపీఎల్‌లో రెండు సెంచరీలు నమోదు చేయగా, జోస్ బట్లర్‌ ఆ రికార్డును సమం చేశాడు... 

యశస్వి జైస్వాల్ 2 బంతుల్లో 1 పరుగు చేసి జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి తైమల్ మిల్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. పడిక్కల్ వికెట్ తీసిన మిల్స్, ఆ ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు...

48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సంజూ శాంసన్, జోస్ బట్లర్ కలిసి మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 21 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసిన సంజూ శాంసన్, కిరన్ పోలార్డ్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

సిమ్రాన్ హెట్మయర్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరాడు. 68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేసిన బట్లర్, బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు...

19వ ఓవర్‌లో కేవలం 3 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్... మూడు వికెట్లు కోల్పోయింది.