ఐపిఎల్ 2019లో భాగంగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ వివాదం చోటుచేసుకుంది. పంజాబ్ కెప్టెన్, బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ బ్యాట్ మెన్స్ జాస్ బట్లర్ ను ఔట్ చేసిన విధానమే  ఈ వివాదానికి కారణమయ్యింది. క్రీడా స్పూర్తిని మరిచి ఓ జట్టు కెప్టెన్ గా మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా వుండాల్సిన అశ్విన్ మన్కడింగ్ కు పాల్పడి తప్పు చేశాడంటూ కొందరు మాజీలతో పాటు అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇలా అందరు అశ్విన్ ను తప్పుబడుతున్న నేపథ్యంలో ఐపిఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా అతడికి మద్దతుగా నిలిచాడు. 

మన్కడింగ్ వివాదంపై ట్విట్టర్ ద్వారా రాజీవ్ శుక్లా స్పందించారు. ‘‘మన్కడింగ్ పై గతంలోనే ఐపిఎల్ కెప్టెన్స్, మ్యాచ్ రిఫరీలతో కలకత్తాలో ఓ సమావేశం నిర్వహించి చర్చించాము. అందులో నాన్-స్ట్రైకర్ ఎండ్ లో గల బ్యాట్స్‌మెన్ బౌలర్ కంటే ముందే క్రీజ్‌ దాటితే బౌలర్ అతన్ని మర్యాదపూర్వకంగా ఔట్ చేయడం సరైనదేనన్న అభిప్రాయానికి వచ్చాం. ఈ సమావేశంలో ధోనీ, విరాట్ కూడా పాల్గొన్నారు’’అని రాజీవ్ శుక్లా ట్వీట్ చేశారు. 

ఇలా మర్యాదపూర్వకంగా ఔట్ చేయడం సరైదనే అంటూ అశ్విన్ చర్యలను శుక్లా సమర్థించారు. దీంతో ఇప్పటివరకు కేవలం అశ్విన్ పైనే ఫైర్ అవుతున్న అభిమానులు ఇప్పుడు రాజీవ్ శుక్లాపై కూడా ట్రోలింగ్ ప్రారంభించారు. క్రికెట్లో క్రీడా స్పూర్తి కంటే ఇలా మర్యాద పూర్వకంగా వ్యవహరించడమే ముఖ్యమైతే ఆటగాళ్ళకు క్రికెట్ మెలకువలకు బదులు మర్యాదగా ఎలా వుండాలో నేర్పించాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 
  
రవిచంద్రన్ అశ్విన్, జాస్ బట్లర్‌ల మధ్య జరిగిన మన్కడింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ విసిరిన 185 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో రాజస్థాన్ బ్యాట్ మెన్స్ దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇలా 108 పరుగుల వద్ద కేవలం ఒకే వికెట్ కోల్పోయి పటిష్ట స్థితిలో వున్న సమయంలో అశ్విన్ మన్కడింగ్ కు పాల్పడి 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బట్లర్ ను ఔట్ చేశాడు. ఈ సమయంలో బట్లర్ కు, అశ్విన్ కు మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. చివరకు థర్డ్ అంపైర్ దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది.