కోల్ కతా: ఐపిఎల్ ఫ్రాంచైజీలన్నీ వేలం పాటలో యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టాయి. సాధ్యమైనంత చురుగ్గా కదిలే యువ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఇందులో ఓ మినహాయింపు మాత్రం ఉంది. వయస్సు ముఖ్యం కాదని ఓ క్రికెటర్ నిరూపించాడు. అతను లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే.

ప్రవీణ్ తాంబే వయస్సు 48 ఏళ్లు. ఐపిఎల్ వేలంలో అమ్ముడైన అతి పెద్ద వయస్సు గల క్రికెటర్ ఆయనే. కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతన్ని రూ. 20 లక్షల బేస్ ప్రైస్ కు సొంతం చేసుకుంది. ఐపిఎల్ లో ఆడే అతి పెద్ద వయస్కుడు తాంబేనే అవుతాడు. 

 

ప్రస్తుతం ఆ రికార్డు బ్రాడ్ హాగ్ పేరు మీద ఉంది. బ్రాడ్ హాగ్ 44 ఏళ్ల వయస్సులో కేకేఆర్ తరఫున ఆడాడు. ప్రవీణ్ తాంబేపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాంబే స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని అంటున్నారు.

48 ఏళ్ల ప్రవీణ్ తాంబే ఐపిఎల్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టి ఆకర్షించడదం ఈ సీజన్ లో తనకు అత్యంత పెద్ద వార్త అని, ఇది విలువైన పాఠమని, కఠిన శ్రమ చేస్తూ ఉంటే ఏదైనా సాధ్యమనే పాఠం నేర్పుతోందని, అలా చేస్తూ పోతుంటే అవకాశం ఎప్పుడైన తలుపులు తడుతుందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ప్రవీణ్ తాంబే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఓ యూజర్ కోరారు.