ఐపీఎల్ 2023 సీజన్‌లో మరోసారి 200 మార్కు దాటిన గుజరాత్ టైటాన్స్... శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ... అభినవ్ మనోహార్‌తో పాటు మెరుపులు మెరిపించిన డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా..

ఐపీఎల్ 2023 సీజన్‌లో భారీ ఆశలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్, గాయంతో మరో మ్యాచ్‌కి దూరం కావడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కష్టాలు తీరడం లేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, ముంబై బౌలర్లను ఓ ఆటాడుకుంటూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు చేసింది.

మొదటి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, తన రెండో ఓవర్‌లో వృద్ధిమాన్ సాహాని అవుట్ చేసి టైటాన్స్‌కి షాక్ ఇచ్చాడు. 7 బంతుల్లో 4 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

14 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, పియూష్ చావ్లా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు..

కుమార్ కార్తీకేయ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్. దీంతో 91 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 19 పరుగులు చేసిన విజయ్ శంకర్ కూడా పియూష్ చావ్లా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..

అయితే అభినవ్ మనోహార్, డేవిడ్ మిల్లర్ కలిసి ఐదో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టైటాన్స్‌కి భారీ స్కోరు అందించారు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన అభినవ్ మనోహార్, హాఫ్ సెంచరీకి ముందు రిలే మెడరిత్ బౌలింగ్‌లో జాసన్ బెహ్రాడార్ఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, జాసన్ బెహ్రాడార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఆఖర్లో 5 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా, గుజరాత్ టైటాన్స్ స్కోరుకి 200 మార్కు దాటించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లాకి 2 వికెట్లు దక్కగా కుమార్ కార్తీకేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెడరిత్, జాసన్ బెహ్రాడార్ఫ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో బౌలింగ్‌కి వచ్చి 31 పరుగులు సమర్పించాడు అర్జున్ టెండూల్కర్. ఆ అనుభవంతో సచిన్ కొడుక్కి మూడో ఓవర్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు రోహిత్ శర్మ. మొదటి 2 ఓవర్లలో 9 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు..