IPL 2023 టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండోసారి తలబడుతున్న కేకేఆర్, ఆర్‌సీబీ..
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇప్పటికే సీజన్ ఫస్టాఫ్ ముగియడంతో సెకండ్ ఆఫ్‌లో మొదటి మ్యాచ్ ఇదే. ఫస్టాఫ్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్‌సీబీ బౌలర్లు అదరగొట్టడంతో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. అయితే రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్ కలిసి ఆర్‌సీబీ బౌలర్లను ఆటాడుకున్నారు.
29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ 204 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యఛేదనలో 123 పరుగులకే ఆలౌట్ అయిన ఆర్‌సీబీ, 81 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.
కోల్‌కత్తాలో కేకేఆర్ చేతుల్లో ఓడిన ఆర్‌సీబీ, బెంగళూరులో దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తోంది. ఆర్‌సీబీతో మ్యాచ్ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో గెలిచిన కేకేఆర్... వరుసగా మ్యాచుల్లో ఓడిపోయింది..
7 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న కేకేఆర్, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. మరోవైపు ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన గత రెండు మ్యాచుల్లో విజయాలు అందుకుంది...
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ, బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పైనే ఆధారపడింది. ఈ ముగ్గురూ కాకుండా మరో ప్లేయర్, ఈ సీజన్‌లో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయాడు.
ముఖ్యంగా ఫాఫ్ డుప్లిసిస్ 7 మ్యాచుల్లో 405 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 279, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 253 పరుగులు చేస్తే మిగిలిన ఆర్‌సీబీ బ్యాటర్లు ఎవ్వరూ 50+ స్కోరు కూడా చేయలేకపోయారు.
బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీ పరిస్థితి ఇలాగే ఉంది. మహ్మద్ సిరాజ్ మినహాయిస్తే మిగిలిన ఆర్‌సీబీ బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నారు. గత సీజన్‌లో దుమ్మురేపిన దినేశ్ కార్తీక్, ఈ సీజన్‌లో ఇప్పటిదాకా మెరుపులు చూపించలేకపోయాడు.. కేకేఆర్‌లో రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ మంచి ఫామ్‌లో ఉన్నా మొదటి రెండు విజయాల తర్వాత బౌలర్ల నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రావడం లేదు.
అన్నింటికీ మించి మాటిమాటికి టీమ్ కాంబినేషన్‌ని మారుస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది కేకేఆర్. నేటి మ్యాచ్‌లో కూడా మరోసారి కొత్త కాంబినేషన్‌తో బరిలో దిగుతోంది కోల్‌కత్తా...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), షాబజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగ, డేవిడ్ విల్లే, విజయ్‌కుమార్ వైశాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు: నారాయణ్ జగదీశన్, జాసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వీజ్, వైభవ్ అరోరా, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
