ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదిన జాసన్ రాయ్... ఈజీ క్యాచ్‌లను డ్రాప్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫస్టాఫ్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించిన ఆర్‌సీబీ బౌలర్లు, సెకండాఫ్‌లోనూ అదే ఫీట్ రిపీట్ చేశారు. పసలేని బౌలింగ్‌కి తోడు చేతుల్లోకి వచ్చిన క్యాచులను జారవిడిచిన ఆర్‌సీబీ, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి భారీ స్కోరు అందించింది... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, 200 పరుగుల భారీ స్కోరు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి ఓపెనర్లు జాసన్ రాయ్, నారాయణ్ జగదీశన్ కలిసి శుభారంభం అందించారు. జాసన్ రాయ్ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తే, నారాయణ్ జగదీశన్ సింగిల్స్ తీస్తూ యాంకర్ రోల్ పోషించాడు...

తొలి వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన నారాయణ్ జగదీశన్, 29 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసి విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో డేవిడ్ విల్లేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన జాసన్ రాయ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు..

ప్రమాదకరంగా మారుతున్న జాసన్ రాయ్, విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వెంటవెంటనే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ దశలో నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ కలిసి మూడో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

6 పరుగుల వద్ద విజయ్‌కుమార్ బౌలింగ్‌లో నితీశ్ రాణా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని సిరాజ్ జారవిడిచాడు. ఆ తర్వాత 19 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో నితీశ్ రాణా ఇచ్చిన క్యాచ్‌ని హర్షల్ పటేల్ నేలపాలు చేశాడు. రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్ రాణా, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు...

ఆ తర్వాత విజయ్‌కుమార్ వైశాక్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో వరుసగా 4, 4, 6 బాదాడు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసిన నితీశ్ రాణా, వానిందు హసరంగ బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

అదే ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ వికెట్ కోల్పోయింది కేకేఆర్. 26 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, హసరంగ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో రింకూ సింగ్ వరుసగా 6, 4, 4 బాది 15 పరుగులు రాబట్టాడు...

సిరాజ్ ఓవర్‌లో ఆఖరి బంతిని ఫేస్ చేసిన ఆండ్రే రస్సెల్ 1 పరుగు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో డేవిడ్ వీజ్ రెండు సిక్సర్లు బాది స్కోరును 200 దాటించారు. రింకూ సింగ్ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేయగా డేవిడ్ వీజ్ 3 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేశాడు.