వర్షం కారణంగా పిచ్ చిత్తడిగా మారడంతో టాస్ ఆలస్యం... ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక ఇవ్వనుంది. వర్షం కారణంగా పిచ్ చిత్తడిగా మారడంతో టాస్ ఆలస్యం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నేటి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఈ మ్యాచ్ సజావుగా జరిగి, ఫలితం తేలడం ఆర్‌సీబీకి అత్యంత అవసరం..
ఇప్పటికే 9 మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్, టేబుల్ టాపర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిచినా, ఓడిపోయినా టైటాన్స్ పొజిషన్ ఏ మాత్రం మారదు. మంగళవారం మే 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది గుజరాత్ టైటాన్స్..
అయితే 13 మ్యాచుల్లో 7 విజయాలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేటి మ్యాచ్‌లో గెలిస్తేనే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కి చేరుకోగలుగుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా, ఆర్‌సీబీ మ్యాచ్ ఓడిపోయినా ముంబై ఇండియన్స్‌కి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది...
ప్లేఆఫ్స్ బెర్తులను కన్ఫార్మ్ చేసేందుకు తప్పక ఫలితం తేలాల్సిన మ్యాచ్ కావడంతో వర్షం తగ్గి రాత్రి 10 గంటల 56 నిమిషాలకు ప్రారంభం అయినా చెరో 5 ఓవర్లతో మ్యాచ్‌ని నిర్వహిస్తారు. అదే జరిగితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 5 ఓవర్ల థ్రిల్లర్ చూసే అవకాశం ఐపీఎల్ ఫ్యాన్స్‌కి దక్కుతుంది. అయితే అది జరగాలంటే వర్షం ఆగి, పిచ్ మ్యాచ్ ఆడేందుకు అణువుగా సిద్దం కావాలి...
అయితే నిన్నటి నుంచి బెంగళూరులో ఎడతెడపి లేకుండా వర్షాలు కురుస్తాయి. నేటి మధ్యాహ్నం కూడా బెంగళూరులో వడ గండ్ల వాన కురిసింది. దీంతో నేడు ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగడం దాదాపు అసాధ్యమేనని తెలుస్తోంది.
ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరోసారి హోరాహోరీ మ్యాచ్ చూడవచ్చని ఆశించిన అభిమానులకు వరుణుడి రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ రద్దు అయితే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.
