Asianet News TeluguAsianet News Telugu

ఆశలు కల్పించి ఆఖర్లో ముంచి.. ఆర్సీబీకి మరో లాస్ట్ ఓవర్ షాక్.. బెంగళూరుపై చెన్నైదే పైచేయి

IPL 2023, RCB vs CSK:చిన్నస్వామి స్టేడియం వేదికగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  - చెన్నై  సూపర్ కింగ్స్  మధ్య  ఉత్కంఠగా సాగిన  ‘బాదుడు సమరం’లో   చెన్నైనే విజయం వరించింది. ఇరు జట్లూ కలిపి ఈ మ్యాచ్ లో  444 పరుగులు చేశాయి. 

IPL 2023:  RCB vs CSK, Chennai Super  Kings Beat Royal Challengers Bangalore by 8 Runs in Last Over Thriller MSV
Author
First Published Apr 17, 2023, 11:20 PM IST | Last Updated Apr 17, 2023, 11:25 PM IST

ఐపీఎల్-16లో  మరో హై స్కోరింగ్ థ్రిల్లర్  అభిమానులను అలరించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  - చెన్నై  సూపర్ కింగ్స్  మధ్య  ఉత్కంఠగా సాగిన  ‘బాదుడు సమరం’లో   చెన్నైనే విజయం వరించింది. ఇరు జట్లూ కలిపి ఈ మ్యాచ్ లో  444 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు  బ్యాటింగ్ చేసిన చెన్నై.. 227 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.  కొండంత లక్ష్యాన్ని కరిగించే క్రమంలో దాదాపు విజయపుటంచుల దాకా  సాగిన   ఆర్సీబీ నావ మరోసారి అదుపుతప్పింది.  లక్ష్య ఛేదనలో ఒక సమయంలో 12.1 ఓవర్లలో 140-2 గా పటిష్టమైన స్థితిలో ఉన్న బెంగళూరు తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి  ఓటమిని కొనితెచ్చుకుంది.  ఆఖరికి  20 ఓవర్లలో 8  వికెట్ల నష్టానికి 218 పరుగులు వద్దే ఆగిపోయింది.  ఆడిన ఐదు మ్యాచ్ లలో చెన్నైకి ఇది మూడో విజయం కాగా  ఆర్సీబీకి మూడో ఓటమి. 

కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  ఆర్సీబీకి తొలి ఓవర్లోనే ఊహించని షాక్ తగిలింది.   ఆకాశ్ సింగ్ వేసిన  తొలి ఓవర్లోనే   రెండో బంతికి బౌండరీ కొట్టిన  కోహ్లీ (6)   నాలుగో బంతికి   ముందుకొచ్చి ఆడబోయాడు.  బంతి  బ్యాట్ కొసకు తాకి  కోహ్లీ కాళ్లకు తగిలి వెనక్కి వచ్చి వికెట్లను పడగొట్టింది.  రెండో ఓవర్లో  తుషార్ దేశ్‌పాండే..   లోమ్రర్  (0)  ను ఔట్ చేశాడు. 

మ్యాక్స్ - డుప్లెసిస్ షో.. 

15కే రెండు వికెట్లు కోల్పోయిన  ఆర్సీబీ  ఇన్నింగ్స్  ను  కెప్టెన్ డుప్లెసిస్ (33 బంతుల్లో 62, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76, 3 ఫోర్లు, 8 సిక్సర్లు)లు  పునర్నిర్మించారు.  క్రీజులో కుదురుకోకముందే ఆకాశ్ సింగ్ వేసిన   మూడో ఓవర్లో   రెండు సిక్సర్లు కొట్టిన మ్యాక్సీ.. అదే దూకుడును  క్రీజులో ఉన్నంతసేపు కొనసాగించాడు. తుషార్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టిన డుప్లెసిస్ కూడా  బాదుడు మంత్రాన్ని పటించాడు.   ఈ ఇద్దరి దూకుడుతో చెన్నై బౌలర్లు  ఎక్కడ బంతులు వేసినా  అవి బౌండరీ లైన్   తేలాయి.  4.3 ఓవర్లలోనే  ఆర్సీబీ స్కోరు  50 పరుగులు దాటింది. పవర్ ప్లే ముగిసేసరికి  75-2 గా ఉంది. 

ఆ తర్వాత  డుప్లెసిస్ కాస్త నెమ్మదించినా    మ్యాక్సీ మాత్రం చిన్నస్వామి స్టేడియంలో  ఫోర్లు, సిక్సర్ల సునామీ సృష్టించాడు.   పతిరన వేసిన   8వ ఓవ్లతో  4, 6 బాదాడు.  జడేజా వేిసన  9వ ఓవర్లో డుప్లెసిస్ ఆఖరి బంతికి  సింగిల్ తీసి 23 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 9 ఓవర్లకే ఆర్సీబీ స్కోరు వంద దాటింది. పతిరన వేసిన  10 వ ఓవర్లో మ్యాక్స్‌వెల్   4, 4, 6 తో    27 బంతుల్లోనే  అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

61 బంతుల్లో  126 పరుగులు జోడించిన ఈ  జోడిని ఎట్టకేలకు తీక్షణ విడదీశాడు. అతడు వేసిన   13వ ఓవర్లో   భారీ షాట్ ఆడిన మ్యాక్స్.. ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే మోయిన్ అలీ.. డుప్లెసిస్ ను ఔట్ చేశాడు. 15  ఓవర్లకు  ఆర్సీబీ   169-4 గా ఉంది. 

 

ఒత్తిడికి చిత్తు.. 

చివరి  ఐదు ఓవర్లలో  58 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులోకి వచ్చిన   దినేశ్ కార్తీక్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్ లో షాబాజ్ ను నిల్చెబెట్టి  బ్యాట్ కు పనిచెప్పాడు. 14 బంతుల్లోనే  3 ఫోర్లు, 1 సిక్సర్ తో  28 పరుగులు చేసి తుషార్ బౌలింగ్  లో తీక్షణ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. 

కార్తీక్ ఔటయ్యాక పతిరన వేసిన మరుసటి ఓవర్లో షాబాజ్  (12)  కూడా రుతురాజ్ కు క్యాచ్ ఇచ్చాడు.   పార్నెల్  (2) ను తుషార్ ఔట్ చేశాడు.   చివరి  ఓవర్లో  19 పరుగులు చేస్తే ఆర్సీబీ విజయమనగా..  పతిరన వేసిన ఆ  ఓవర్లో  తొలి రెండు  బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి.  మూడో బాల్ కు  ప్రభుదేశాయ్  సిక్సర్ కొట్టాడు. అప్పుడు సమీకరణం  3 బంతుల్లో 11 పరుగులుగా మారింది. నాలుగో బాల్ కు పరుగు రాలేదు.  ఐదో బాల్ కు రెండు పరుగులే రావడంతో  చెన్నై విజయం ఖాయమైంది. చివరి బాల్  కు ప్రభుదేశాయ్   జడేజాకు క్యాచ్  ఇచ్చాడు.  ఫలితంగా సీఎస్కే  8 పరుగుల తేడాతో గెలిచింది.  

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన  చెన్నై సూపర్ కింగ్స్   డెవాన్ కాన్వే (83), శివమ్ దూబే (52), అజింక్యా రహానే (37) రాణించడంతో   నిర్ణీ  20 ఓవర్లలో  226 పరుగులు చేసింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios