IPL 2023: హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన మనీశ్ పాండే... మొదటి మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసిన విజయ్ కుమార్ వైశాక్... 23 పరుగుల తేడాతో ఆర్‌సీబీకి ఘన విజయం..
చిన్న స్వామి స్టేడియంలో 175 పరుగుల టార్గెట్ అంటే చాలా తక్కువే. ఇదే సీజన్‌లో, ఇదే స్టేడియంలో 212 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో ఢిల్లీపై 174 పరుగుల స్కోరు చేయడంతోనే ఆర్‌సీబీ ఓటమి ఖాయమనుకున్నారంతా... అయితే ఆర్‌సీబీది దరిద్రం అయితే ఢిల్లీది అంతకుమించి అని నిరూపిస్తూ... మొదటి ఓవర్ నుంచి వరుస వికెట్లు కోల్పోయి, 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది డేవిడ్ వార్నర్ టీమ్. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది వరుసగా ఐదో ఓటమి. మొదటి మ్యాచ్ విజయం తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, ఢిల్లీని ఓడించి కమ్‌బ్యాక్ విజయం అందుకుంది...
ఆర్‌సీబీని భారీ స్కోరు చేయకుండా నిలువరించామనే ఆనందం ఎక్కువ సేపు నిలవకుండానే 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న పృథ్వీ షాని, ఇంపాక్ట్ ప్లేయర్ అనుజ్ రావత్ రనౌట్ చేశాడు. 1 పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
పెళ్లి చేసుకున్న మూడు రోజులకే ఐపీఎల్ కోసం ఇండియాకి వచ్చిన మిచెల్ మార్ష్, ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో డకౌట్ నమోదు చేశాడు. వేన్ పార్నెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన మిచెల్ మార్ష్, విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 2 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో అండర్ 19 కెప్టెన్ యశ్ ధుల్ అవుట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసి 1 పరుగు చేసిన యశ్ ధుల్, నేటి మ్యాచ్‌లో కూడా 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో యశ్ ధుల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ అవుట్ ఇచ్చిన వెంటనే డీఆర్‌ఎస్ తీసుకున్నా ఫలితం దక్కలేదు. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
3 ఓవర్లు ముగిసే సమయానికి 4 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. సిరాజ్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన డేవిడ్ వార్నర్, కొత్త ఆటగాడు విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
8 బంతుల్లో 5 పరుగులు చేసిన అభిషేక్ పోరెల్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. 14 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన అక్షర్ పటేల్ కూడా విజయ్‌కుమార్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన మనీశ్ పాండే, 38 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న ఆర్‌సీబీకి అనుకూలంగా ఫలితం దక్కింది. 7 బంతుల్లో 4 పరుగులు చేసిన లలిత్ యాదవ్ కూడా విజయ్ కుమార్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన రజత్ పటిదార్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన విజయ్‌కుమార్ వైశాక్, మొదటి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన ఆమన్ ఖాన్, సిరాజ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఖర్లో ఆన్రీచ్ నోకియా వరుసగా బౌండరీలు బాది ఓటమి తేడాని తగ్గించగలిగాడు. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 36 పరుగులు కావాల్సి వచ్చాయి.
మొదటి బంతికి నోకియా ఫోర్ బాదినా 5 బంతుల్లో 32 పరుగులు కావాల్సి రావడంతో ఢిల్లీ ఓటమి ఖారారైపోయింది. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగలిగింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
