Asianet News TeluguAsianet News Telugu

రెహ్మానుల్లా గుర్భాజ్ సూపర్ హాఫ్ సెంచరీ... గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్...

IPL 2023 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేసిన రెహ్మానుల్లా గుర్భాజ్... 3 వికెట్లు తీసిన మహ్మద్ షమీ... 

IPL 2023: Rahmanullah Gurbaz half century, Kolkata Knight Riders scored decent total CRA
Author
First Published Apr 29, 2023, 6:04 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదిన జాసన్ రాయ్ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో అతని స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రెహ్మనుల్లా గుర్భాజ్, అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగి కేకేఆర్‌కి భారీ స్కోరు అందించాడు...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగుల స్కోరు చేసింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆట ప్రారంభం అయ్యే దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో పాటు చినుకులు మొదలయ్యాయి... 

45 నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. 15 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసిన నారాయణ్ జగదీశన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్‌కి పంపింది కేకేఆర్. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన శార్దూల్, టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 4 బంతులాడి డకౌట్ అయ్యాడు..

మహ్మద్ షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి యత్నించిన శార్దూల్ ఠాకూర్, మోహిత్ శర్మ పట్టిన సూపర్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఓ ఎండ్‌లో రెహ్మానుల్లా గుర్భాజ్ బౌండరీలతో ఢీల్ చేస్తుంటే మరో ఎండ్‌లో వెంకటేశ్ అయ్యర్ సింగిల్స్ తీస్తూ అతనికి స్ట్రైయిక్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు...

14 బంతుల్లో 11 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, జోషువా లిటిల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 3 బంతుల్లో ఓ ఫోర్ బాదిన కెప్టెన్ నితీశ్ రాణా కూడా జోషువా లిటిల్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు..

39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేసిన రెహ్మానుల్లా గుర్భాజ్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన రింకూ సింగ్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో జోషువా లిటిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్, మహ్మద్ షమీ వేసిన ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి అవుట్ కాగా డేవిజ్ వీజ్ ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేయర్‌గా పంజాబ్ కింగ్స్‌పై 55 పరుగులు సమర్పించిన రషీద్ ఖాన్, నేటి మ్యాచ్‌లో వికెట్ తీయకుండా 54 పరుగులు సమర్పించి, ఐపీఎల్‌లో రెండో అతి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు...

ఆఫ్ఘాన్ బ్యాటర్  రెహ్మానుల్లా గుర్భాజ్, ఆఫ్ఘాన్ బౌలర్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఫ్ఘాన్ ఫీల్డర్ రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం విశేషం..  గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీయగా ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్, ఆఫ్ఘాన్ బౌలర్ నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios