IPL 2023: గువహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్  - పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్ లో   పంజాబ్ నే విజయం వరించింది. విజయం కోసం ఇరు జట్లు ఆఖరి వరకూ పోరాడినా రాజస్తాన్ కు షాక్ తప్పలేదు. 

ఐపీఎల్-16 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అదిరిపోయే ఆటతో సీజన్ ను ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్‌కు పంజాబ్ కింగ్స్ షాకిచ్చింది. గువహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ లో దుమ్మరేపిన పంజాబ్.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా రెచ్చిపోయింది. పంజాబ్ బౌలర్ నాథన్ ఎలీస్ ధాటికి రాజస్తాన్ టాపార్డర్ కుప్పకూలింది. నాలుగు ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో చెలరేగిన ఎలీస్‌కు తోడు అర్ష్‌దీప్ సింగ్ (2-47) కూడా రాణించడంతో పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. విజయం కోసం రాజస్తాన్ ఆఖరి బంతి వరకూ పోరాడినా శాంసన్ సేనకు ఓటమి తప్పలేదు. ఫలితంగా పంజాబ్.. 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది రెండో విజయం.

భారీ లక్ష్య ఛేదనలో రాజస్తాన్ కు ఆదిలోనే షాకుల తాకాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఫీల్డింగ్ చేస్తుండగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఇచ్చిన క్యాచ్ ను అందుకునే క్రమంలో చేతికి గాయమైన జోస్ బట్లర్ ఓపెనర్ గా రాలేదు. యశస్వి జైస్వాల్ (11) తో కలిసి అశ్విన్ (0) బరిలోకి దిగాడు.

సామ్ కరన్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికి సిక్సర్ కొట్టిన జైస్వాల్.. మరోసారి సన్ రైజర్స్ తో చెలరేగుతాడని రాజస్తాన్ అభిమానులు భావించారు. కానీ అర్ష్‌దీప్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతిని బౌండరీ తరలించిన జైస్వాల్.. మూడో బంతికి ఎక్స్‌ట్రా కవర్ వద్ద ఉన్న షార్ట్ లోక్యాచ్ అందుకోవడంతో నిష్క్రమించాడు. వన్ డౌన్ గా బట్లర్ (11 బంతుల్లో 19, 1 ఫోర్, 1 సిక్స్) బ్యాటింగ్ కు వచ్చాడు. అర్ష్‌దీపే వేసిన మరుసటి ఓవర్లో అశ్విన్.. భారీ షాట్ ఆడి మిడాన్ వద్ద ఉన్న శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చాడు. నాథన్ ఎల్లిస్ వేసిన ఆరో ఓవర్లో మూడో బంతికి బట్లర్ అతడికే క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 

నిలబెట్టిన శాంసన్-పడిక్కల్..

క్రీజలోకి రావడం రావడమే సిక్సర్ బాదిన సంజూ శాంసన్ (25 బంతుల్లో 42, 5 ఫోర్లు, 1 సిక్స్).. హర్‌ప్రీత్ బ్రర్ వేసిన ఐదో ఓవర్లో రెండు బౌండరీలు సాధించాడు. అదే ఊపులో నాథన్ ఎల్లీస్ బౌలింగ్ లో కూడా రెండు సార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు.బట్లర్ నిష్క్రమించిన తర్వత దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 21, 1 ఫోర్) తో కలిసి నాలుగో వికెట్ కు 32 బంతుల్లో 34 పరుగులు జోడించాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించింది. 

కూల్చిన ఎలీస్.. 

సాఫీగా సాగుతున్న ఈ జోడీని నాథన్ ఎలీస్ విడదీశాడు. అతడు వేసిన 11వ ఓవర్లో ఆఖరి బంతికి శాంసన్.. భారీ షాట్ ఆడగా షార్ట్ కు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు. శాంసన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన లోకల్ బాయ్ రియాన్ పరాగ్ (12 బంతుల్లో 20, 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆడిన నాలుగో బంతికి మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. సికిందర్ రజ వేసిన 13వ ఓవర్లోనూ లాంగాన్ దిశగా మరో సిక్సర్ బాదాడు. కానీ నాథన్ ఎలీస్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి పరాగ్.. లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడగా షారుఖ్ ఖాన్ క్యాచ్ అందుకున్నాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి పడిక్కల్ కూడా బౌల్డ్ అయ్యాడు.

Scroll to load tweet…

శివాలెత్తిన షిమ్రన్ - ధ్రువ్ 

రియాన్ పరాగ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షిమ్రన్ హెట్మెయర్ (18 బంతుల్లో 36, 1 ఫోర్, 3 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. ఎలీస్ వేసిన 17వ ఓవర్లో తొలి బంతికి హెట్మెయర్, ఐదో బంతికి ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32, 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా సిక్సర్లు బాదారు. సామ్ కరన్ వేసిన 18వ ఓవర్లో హెట్మెయర్ 6,4, 6 కొట్టాడు. చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్‌దీప్ వేసిన 19వ ఓవర్లో ధ్రువ్.. 4,6,4 తో రాజస్తాన్ శిబిరంలో ఆశలు రేపాడు. అదే ఓవర్లో ఆఖరి బంతికి హెట్మెయర్ ఇచ్చిన క్యాచ్ ను ఎలీస్ మిస్ చేశాడు.

ఆఖర్లో ఉత్కంఠ.. 

 ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. సామ్ కరన్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికి ఒక్క పరుగే వచ్చింది. రెండో బంతికి రెండు పరుగులొచ్చాయి. మూడో బంతికి రెండో పరుగుల తీయబోయిన హెట్మెయర్ రనౌట్ అయ్యాడు. నాలుగో బంతికి కూడా ఒక్క పరుగే వచ్చింది. కానీ ఐదో బంతికి ఒక్క పరుగే రాగా ఆఖరి బంతికి బౌండరీ బాదినా అప్పటికే పంజాబ్ విజయం ఖాయమైంది. 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్) కు తోడుగా ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60) లు ధాటిగా ఆడారు.