Asianet News TeluguAsianet News Telugu

సిక్సర్లు, ఫోర్లతో మోతెక్కిన మొహాలి.. పంజాబ్ ముందు కొండంత టార్గెట్

IPL 2023, PBKS vs LSG: ఐపీఎల్ -16లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య  మొహాలి వేదికగా జరుగుతున్న  మ్యాచ్ లో  పరుగుల ప్రవాహం ఏరులై పారింది.  లక్నో బ్యాటర్లు అయితే సిక్స్ లేకుంటే ఫోర్ అన్నంత రేంజ్ లో వీరబాదుడు బాదారు. 

IPL 2023 PBKS vs LSG:  Lucknow Super Giants Batters Given 258 Target To Punjab Kings MSV
Author
First Published Apr 28, 2023, 9:24 PM IST

మొహాలి మోతెక్కింది.  లక్నో సూపర్ జెయింట్స్  బ్యాటర్లు  వీరబాదుడు బాదడంతో పంజాబ్ లో  పరుగుల ప్రవాహం ఏరులై పారింది.  కుదిరితే సిక్సర్ లేకుంటే  బౌండరీ అన్నంత రేంజ్ లో లక్నో బ్యాటర్లు రెచ్చిపోయారు.  లక్నో జట్టులో ఒక్క కెఎల్ రాహుల్ తప్ప మిగిలినవారంతా దొరికిన బంతిని దొరికినట్టుగా బాదారు. కైల్ మేయర్స్ (24 బంతుల్లో 54, 7 ఫోర్లు, 4 సిక్సర్లు)  సృష్టించిన  పరుగుల తుఫానును  మార్కస్ స్టోయినిస్ (40 బంతుల్లో 72, 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అయుష్ బదోని  (24 బంతుల్లో 43, 3 ఫోర్లు, 3 సిక్సర్లు),  నికోలస్ పూరన్ (19 బంతుల్లో 45, 7 ఫోర్లు, 1 సిక్స్)  లు సునామీగా మార్చారు. వీరి ధాటికి  నిర్ణీత 20 ఓవర్లలో లక్నో.. 5 వికెట్ల నష్టానికి 257  పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండను ఛేదించాలంటే  పంజాబ్ డబుల్ కష్టపడాల్సిందే. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  లక్నోకు మేయర్స్ శుభారంభమే అందించాడు.  అర్ష్‌దీప్ వేసిన  రెండో ఓవర్లో  నాలుగు ఫోర్లు కొట్టిన అతడు తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. కానీ రాహుల్ (12)నిరాశపరిచాడు. రబాడా వేసిన  నాలుగో ఓవర్లో రెండో బాల్  రాహుల్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి ఫస్ట్ స్లిప్ లో షారుక్ ఖాన్ చేతిలో పడింది. 

మేయర్స్ బాదుడు.. 

రజ వేసిన ఐదో ఓవర్లో మేయర్స్.. 6, 4, 6 తో 40లలోకి చేరాడు. రబాడా వేసిన  ఆరో ఓవర్లో  ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టి 20 బంతుల్లోనే హాఫ్  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఇదే ఓవర్లో ఐదో బాల్ కు ధావన్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 

 

మార్కస్ - బదోని  షో.. 

ఓపెనర్లు నిష్క్రమించిన తర్వాత   వన్ డౌన్ లో వచ్చిన  బదోనికి  మార్కస్ స్టోయినిస్ జత కలిశాడు. ఇద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లను ఆటాడుకున్నారు.   47 బంతుల్లోనే  89 పరుగులు జోడించారు.  గుర్నూర్ బ్రర్ వేసిన 8వ ఓవర్లో   ఈ ఇద్దరూ 4, 6, 4, 6 బాదారు. సామ్ కరన్ వేసిన  పదో ఓవర్లో  స్టోయినిస్ 4,6 కొట్టడంతో 50  పరుగుల భాగస్వామ్యం పూర్తైంది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరూ ఇదే జోరు కొనసాగించారు.  రాహుల్ చాహర్  వేసిన  13వ ఓవర్లో   స్టోయినిస్ కొట్టిన భారీ షాట్ ను లివింగ్‌స్టోన్ అందుకున్నా  అతడు బౌండరీ లైన్ ను తాకాడు. అప్పటికీ స్టోయినిస్ ఇంకా 39 పరుగుల వద్దే ఉన్నాడు.  తనకు వచ్చిన అవకాశాన్ని  స్టోయినిస్ చక్కగా వినియోగించుకున్నాడు. అయితే ఆ మరుసటి ఓవర్ వేసిన లివింగ్‌స్టోన్.. బదోనిని ఔట్ చేశాడు. 

పూరన్ పూనకమెత్తినట్టు.. 

బదోని స్థానంలో వచ్చిన  నికోలస్ పూరన్ కూడా పూనకమెత్తినట్టే ఆడాడు.   లివింగ్‌స్టోన్ వేసిన  అదే ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. 15 ఓవర్లకే లక్నో స్కోరు  184-3గా ఉంది. రబాడా వేసిన  16వ ఓవర్లో స్టోయినినష్  సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్ష్‌దీప్ వేసిన 17వ ఓవర్లో పూరన్ మరో 3 బౌండరీలు కొట్టాడు. కరన్ - స్టోయినిస్ లు కూడా  నాలుగో వికెట్ కు 30 బంతుల్లోనే  76 రన్స్ జోడించారు. కానీ సామ్ కరన్ వేసిన  19వ  ఓవర్లో స్టోయినిస్ రెండో బాల్ కు భారీ షాట్ ఆడబోయి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో   12 పరుగులు రావడంతో లక్నో స్కోరు 250 దాటింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios