ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.2 కోట్ల 60 లక్షలకు వివ్‌రాంత్ శర్మను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

ఐపీఎల్, ఎంతో మంది క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, చేతన్ సకారియా, మహ్మద్ సిరాజ్... ఎలా ఎందరో కడు పేద కుటుంబంలో జన్మించిన ప్లేయర్లు, ఐపీఎల్‌ కారణంగా వెలుగులోకి వచ్చి టీమిండియా తరుపున ఆడే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. తాజాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఓ కశ్మీరి కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించాడు...
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల వివ్‌రాంత్ శర్మ, ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.2 కోట్ల 60 లక్షల భారీ ధర దక్కించుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో మెరిసే ప్లేయర్లకు బేస్ ప్రైజ్ పెట్టి కొనుగోలు చేసే ఫ్రాంఛైజీలు, వివ్‌రాంత్ శర్మ కోసం పోటీపడ్డాయి...
రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్టు వివ్‌రాంత్ శర్మ కోసం పోటీలో నిలిచినా రూ.2 కోట్ల 60 లక్షల భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లెగ్ స్పిన్నర్‌ని సొంతం చేసుకుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఇద్దరు కశ్మీర్ ప్లేయర్లు ఉన్నారు. వివ్‌రాంత్ సింగ్ రాకతో ఈ సంఖ్య మూడుకి చేరింది...

వివ్‌రాంత్ శర్మ అన్న విక్రాంత్ శర్మ కూడా క్రికెటరే. అయితే కుటుంబ పోషణ కోసం క్రికెట్ కెరీర్‌ని వదులుకున్న విక్రాంత్ శర్మ, ప్రస్తుతం వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. తన కోసం అన్న చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకున్న వివ్‌రాంత్, లిస్టు ఏలో జమ్ము కశ్మీర్ తరుపున ఎంట్రీ ఇచ్చి ఐపీఎల్ ఆడబోతున్నాడు...

విజయ్ హాజారే ట్రోఫీ 2022 టోర్నీలో 8 మ్యాచుల్లో 56.42 యావరేజ్‌తో 395 పరుగులు చేసిన వివ్‌రాంత్ శర్మ, ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అలాగే ఐదు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు..

సయ్యద్ ముస్తాక్ ఆలీ 2022 టోర్నీలో ఐదు మ్యాచుల్లో 128 పరుగులు చేసిన వివ్‌రాంత్ శర్మ, 6 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన జమ్ము కశ్మీర్ బౌలర్‌గా నిలిచాడు. 

‘మా అన్నయ్య విక్రాంత్ శర్మ క్రికెట్ ఆడేవాడు. యూనివర్సిటీ లెవెల్లో అతనికి మంచి రికార్డులు కూడా ఉన్నాయి. మా అన్న ఆటను చూసిన తర్వాత నేను కూడా క్రికెట్ ఆడడం మొదలెట్టా. జమ్మూలో క్రికెట్ ప్రాక్టీస్ చేశా. నాకు మా అన్న సలహాలు, సూచనలు ఎంతో సహాయ పడ్డాయి...
పర్వేజ్ రసూల్ భాయ్‌ సారథ్యంలో ఆరంగ్రేటం చేశా. నాకు ప్రతీ ఒక్కరూ అండగా నిలిచారు. మా అన్నయ కుటుంబ పోషణ కోసం క్రికెట్‌ని పక్కనబెట్టాల్సి వచ్చింది. అయితే నన్ను క్రికెటర్‌గా చూడాలని అన్నయ్య కలలు కన్నాడు. అందుకే నాకు ఎంతో అండగా నిలిచాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు వివ్‌రాంత్ శర్మ..
2022 ఐపీఎల్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు వివ్‌రాంత్ శర్మ, ఐపీఎల్ 2023 సీజన్‌లో టీమ్‌ తరుపున ఆడబోతున్నాడు. వివ్‌రాంత్, మరో ఉమ్రాన్ మాలిక్‌లా సంచలనాలు క్రియేట్ చేసి, టీమిండియాలోకి వస్తాడా? లేక అబ్దుల్ సమద్‌లా తుదిజట్టులో కూడా చోటు కోల్పోతాడా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..