IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... మొదటి రెండు మ్యాచుల్లో ఓడి, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన ముంబై, హైదరాబాద్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలబడుతోంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది..

ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ రెండు జట్లు కూడా ఒకే రకమైన పొజిషన్‌లో ఉన్నాయి. మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన సన్‌‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లను ఓడించి వరుసగా రెండు విజయాలు అందుకుంది..

మరోవైపు తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి బోణీ కొట్టింది. ఆ తర్వాత కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో కమ్‌బ్యాక్ విజయం అందుకుంది. ముంబై ఇండియన్స్‌కి వచ్చిన రెండు విజయాలు కూడా ఛేదనలో వచ్చినవే. 

తొలుత బ్యాటింగ్ చేసిన మొదటి రెండు మ్యాచుల్లో కూడా లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చేతులు ఎత్తేసింది ముంబై ఇండియన్స్. మొదటి మ్యాచ్‌లో ఆడిన జోఫ్రా ఆర్చర్, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 

ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా మినహా ఇస్తే మిగిలిన బౌలర్లు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు ఐపీఎల్ 2023 సీజన్‌లో టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఉన్న జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ ఇలా వరల్డ్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్లు, ఆరెంజ్ ఆర్మీలో ఉన్నారు. అయితే వీరిలో టి నటరాజన్ భారీగా పరుగులు ఇస్తుంటే, ఉమ్రాన్ మాలిక్, భువీ కూడా అంచనాలు అందుకోలేకపోయారు..

అయితే గత 2 మ్యాచుల్లో 6 వికెట్లు తీసిన మయాంక్ మార్కండే, సన్‌రైజర్స్ తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. గతంలో ముంబై ఇండియన్స్‌కి ఆడిన మయాంక్, తన పాత టీమ్‌పై ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది..

మరోవైపు ముంబై ఇండియన్స్ తరుపున టాప్ స్కోరర్‌గా ఉన్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, సొంత మైదానంలో ఆడబోతున్నాడు. రోహిత్ శర్మతో పాటు గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‌లోకి రావడంతో బ్యాటింగ్‌నే నమ్ముకుని బరిలో దిగుతోంది ముంబై ఇండియన్స్...

నేటి మ్యాచ్‌లో అన్న మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతుంటే, తమ్ముడు డువాన్ జాన్సెన్, ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నాడు. అయితే మొదటి మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన డువాన్ జాన్సన్‌ని తుది జట్టు నుంచి తప్పించింది ముంబై ఇండియన్స్. అతని స్థానంలో జాసన్ బెహ్రాన్‌డ్రార్ఫ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది: మయాంక్ అగర్వాల్, హారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్

ముంబై ఇండియన్స్ జట్టు ఇది: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వదేరా, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రాన్‌డ్రార్ఫ్