IPL 2023, MI vs SRH:ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. వాంఖెడేలో ఛాంపియన్ ఆట ఆడింది. బౌలింగ్ లో విఫలమైనా బ్యాటర్లు వీరవిహారం చేసి ముంబై ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచారు.
ఐపీఎల్ - 16 లో ప్లేఆఫ్స్ రేసును ముంబై ఇండియన్స్ మరింత రసవత్తరంగా మార్చింది. వాంఖెడే వేదికగా ముంబై - హైదరాబాద్ మధ్య ముగిసిన హై స్కోరింగ్ గేమ్‌ను ముంబై అలవోకగా గెలుచుకుంది. సన్ రైజర్స్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్.. 18 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కామెరూన్ గ్రీన్ (47 బంతుల్లో 100 నాటౌట్, 8 ఫోర్లు, 8సిక్సర్లు) వీరవిహారంతో ఐపీఎల్ తో పాటు తన టీ20 కెరీర్ లో ఫస్ట్ సెంచరీ చేశాడు. గ్రీన్ కు తోడుగా కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 56, 8 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 25 నాటౌట్, 4 ఫోర్లు ) బాదుడు సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించి ముంబైకి ఘన విజయాన్ని అందించారు.
ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నా బెంగళూరు వేదికగా జరుగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఫలితంపై ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బెంగళూరులో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా.. ఒకవేళ మ్యాచ్ లో గుజరాత్ గెలిచినా ముంబై ప్లేఆఫ్స్ చేరినట్టే.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. 12 బంతుల్లో ఓ బౌండరీ, సిక్సర్ తో 14 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ను భువనేశ్వర్ తన రెండో ఓవర్లో ఆఖరి బంతికి ఔట్ చేశాడు.
గ్రీన్ - రో‘హిట్’
ఇషాన్ స్థానంలో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కామెరూన్ గ్రీన్.. రోహిత్ శర్మతో జత కలిశాడు. ఇద్దరూ కలిసి వాంఖెడేలో పరుగుల వరద పారించారు. సన్ రైజర్స్ బౌలర్లను క్లబ్ స్థాయి బౌలర్ల కంటే దారుణంగా బాదారు. భువీ బౌలింగ్ లో ఎదుర్కున్న ఫస్ట్ బాల్ కే బౌండరీ బాదిన గ్రీన్.. ఆ దూకుడును తాను క్రీజులో ఉన్నంతవరకూ కొనసాగించాడు. మరోవైపు రోహిత్ కూడా క్రీజులో కుదురుకునేదాకా కాస్త నెమ్మదిగా ఆడినా తర్వాత పుంజుకున్నాడు.
నితీశ్ రెడ్డి, కార్తీక్ త్యాగి, మయాంక్ దగర్.. ఇలా బౌలర్లు మారినా గ్రీన్ బాదుడు అయితే మారలేదు. వివ్రంత్ శర్మ వేసిన 9వ ఓవర్లో ఐదో బాల్ కు సిక్సర్ కొట్టిన గ్రీన్.. 20 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన పదో ఓవర్లో రోహిత్ మూడు బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో రోహిత్.. టీ20లలో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కార్తీక్ త్యాగి వేసిన 12వ ఓవర్లో రెండో బాల్ కు ఫోర్ కొట్టి అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లు పూర్తయ్యేలోపే ముంబై స్కోరు 150 పరుగులకు చేరింది. అయితే మయాంక్ దగర్ వేసిన 14వ ఓవర్లో.. రోహిత్.. నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 64 బంతుల్లో 128 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
గ్రీన్ సెంచరీ..
రోహిత్ నిష్క్రమించినా గ్రీన్ బాదుడుకు అడ్డుకట్ట పడలేదు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 16వ ఓవర్లో గ్రీన్.. 4,6 కొట్టగా చివరి రెండు బంతులకు సూర్య కూడా రెండు బౌండరీలు కొట్టాడు. ఇదే సమయంలో 90లలోకి చేరిన గ్రీన్.. భువీ వేసిన 18వ ఓవర్లో రెండో బాల్ కు బౌండరీ బాది 98కి వచ్చాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి తన టీ20 కెరీర్ లో ఫస్ట్ సెంచరీ చేయడమే గాక మ్యాచ్ ను కూడా ముగించాడు.
ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు వివ్రంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ (83) లు ఫస్ట్ వికెట్ కు 140 పరుగులు జోడించారు.
