Asianet News TeluguAsianet News Telugu

IPL 2023: ముంబై ఇండియన్స్‌కి వరుసగా రెండో విజయం... ఇషాన్ కిషన్‌ హాఫ్ సెంచరీ, కేకేఆర్‌కి రెండో షాక్...

IPL 2023 సీజన్‌లో ముంబైకి వరుసగా రెండో విజయం... కేకేఆర్‌కి వరుసగా రెండో ఓటమి! హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.. 

IPL 2023 MI vs KKR: Mumbai Indians beats Kolkata Knight Riders, Venkatesh Iyer century CRA
Author
First Published Apr 16, 2023, 7:21 PM IST

వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసినా కేకేఆర్‌కి ఓటమి తప్పలేదు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి ఓవర్ చివరి బంతికి గెలిచి గెలుపు బాట పట్టిన ముంబై ఇండియన్స్, కేకేఆర్‌ బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం చూపించి వరుసగా రెండో విజయం అందుకుంది.. 186 పరుగుల టార్గెట్‌ని 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించి, సునాయాస విజయం అందుకుంది ముంబై టీమ్.. 

ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌తో కలిసి తొలి వికెట్‌కి 65 పరుగులు జోడించాడు. 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన తిలక్ వర్మ కూడా సుయాశ్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..

తిలక్ వర్మ అవుట్ అయ్యే సమయానికే ముంబై ఇండియన్స్‌కి 37 బంతుల్లో 38 పరుగులే కావాల్సి వచ్చాయి. మొదటి మూడు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే మ్యాచ్‌లో ముంబై విజయం ఖరారైపోయింది.  

టిమ్ డేవిడ్ 24 పరుగులు చేయగా 4 బంతుల్లో 6 పరుగులు చేసిన నేహాల్ వదేరా, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. డేవిడ్ సింగిల్‌ తీసి మ్యాచ్ ఫినిష్ చేశాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 23 పరుగుల తేడాతో పోరాడి ఓడిన కేకేఆర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండో ఓటమి నమోదు చేయగా ఢిల్లీపై గెలిచి ఐపీఎల్ 2023 సీజన్‌లో బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్, వరుసగా రెండో విజయంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. నేటి మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్‌, ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన నారాయణ్ జగదీశన్, హృతిక్ షోకీన్ పట్టిన సూపర్ క్యాచ్‌కి డకౌట్ అయ్యాడు.  

12 బంతుల్లో 8 పరుగులు చేసిన రహ్మనుల్లా గుర్భాజ్, పియూష్ చావ్లా బౌలింగ్‌లో జాన్సెన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో 5 పరుగులు చేసిన నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో వెంకటేశ్ అయ్యర్ బౌండరీల మోత మోగించడంతో కేకేఆర్ స్కోరు వేగం ఎక్కడా తగ్గలేదు..

23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ అయ్యర్, 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరుపున ఐపీఎల్‌లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్. ఇంతకుముందు 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సెంచరీ చేశాడు..

51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, రిలే మెడరిత్ బౌలింగ్‌లో డాన్ జాన్సెన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..  18 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన రింకూ సింగ్, జాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా ఆండ్రే రస్సెల్ 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ స్కోరుని 180+ దాటించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios