IPL 2023: ఐపీఎల్ - 16 లో భాగంగా ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్ ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీ కొట్టింది.
రాజస్తాన్ రాయల్స్ తో శనివారం జైపూర్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సేనను 59 పరుగులకే ఆలౌట్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేయగా రాజస్తాన్.. 59 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆర్సీబీని పొగుడుతూ ట్వీట్ చేయడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
బెంగళూరు మ్యాచ్ గెలిచిన తర్వాత లక్నో తన ట్విటర్ ఖాతా వేదికగా ‘ఆర్సీబీ సూపర్’ అని ట్వీట్ చేసింది. ఇది గంభీర్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఈనెల 1న లక్నో - బెంగళూరు మధ్య మ్యాచ్ లో గంభీర్ - కోహ్లీలు గొడవపడ్డ విషయం తెలిసిందే.
లక్నో - బెంగళూరు మ్యాచ్ కు ముందు చిన్నస్వామిలో ఇవే రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిశాక గంభీర్.. అల్లరి చేయకండంటూ నోటికి వేలు అడ్డం పెట్టడం, కోహ్లీ కూడా లక్నోలో అదే రిపీట్ చేయడం.. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ తో గొడవ, చివర్లో గంభీర్ తో వాగ్వాదంతో లక్నో - బెంగళూరు అంటే అది దాయాదుల పోరులా మారింది. ఇక మే 1న మ్యాచ్ తర్వాత ఈ జట్లు ఆడే మ్యాచ్ లలో కోహ్లీ, నవీన్, గంభీర్ లు సోషల్ మీడియా వేదికగా చేసుకున్న పోస్టులు కూడా నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
తాజాగా లక్నో ట్వీట్ పై కూడా నెటిజన్లు గంభీర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గంభీర్ ఫోటోలు, మీమ్స్ తో ట్విటర్ ను హోరెత్తిస్తున్నారు. ఈ ఫోటోలు, మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
