సారాంశం

IPL 2023, LSG vs MI Eliminator:  లక్నో సూపర్ జెయింట్స్‌కు వరుసగా రెండో సీజన్ లో కూడా అదృష్టం కలిసిరాలేదు. ఐపీఎల్-16 లో కూడా ఆ జట్టు ఎలిమినేటర్‌లోనే ఎలిమినేట్ అయిపోయింది. 

ఐపీఎల్‌లో వరుసగా రెండో సీజన్‌లో  ప్లేఆఫ్స్‌కు చేరినా లక్నో సూపర్ జెయింట్స్‌..  ఈ ఏడాది కూడా ఎలిమినేటర్ గండాన్ని దాటలేకపోయింది. ఐదు సార్లు ఛాంపియన్‌‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ వ్యూహాలకు కృనాల్ సేన కుదేలైంది.  ముంబై నిర్దేశించిన  183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో..  16.3 ఓవర్లలో 101 పరుగులకే  ఆలౌట్ అయింది. ఫలితంగా ముంబై 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై  యువ పేసర్ ఆకాశ్ మధ్వాల్ మ్యాజిక్ తో  ఆ జట్టు క్వాలిఫయర్ -2కు అర్హత సాధించింది.  లక్నో ఇన్నింగ్స్ లో 3.3 ఓవర్లు వేసిన  మధ్వాల్.. ఐదు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు  పడగొట్టి సంచలన ప్రదర్శన చేయడమే గాక లక్నో ఓటమిని శాసించాడు. 

ఈ ఓటమితో లక్నో ఇంటిబాట పట్టింది.  ఈనెల 26న అహ్మదాబాద్ వేదికగా  రెండో క్వాలిఫయర్ లో  ముంబై - గుజరాత్  తలపడతాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. మే 28న చెన్నై సూపర్ కింగ్స్ తో ఫైనల్ లో తలపడుతుంది. 

లక్ష్య ఛేదనలో లక్నోకు  ఆది నుంచీ కష్టాలే ఎదురయ్యాయి. లక్నో ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆకాశ్ మధ్వాల్..  ప్రేరక్ మన్కడ్  (3) ను ఔట్ చేసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు.   13 బంతుల్లో   3 బౌండరీల సాయంతో 18 పరుగులు చేసిన  కైల్ మేయర్స్‌ను    క్రిస్ జోర్డాన్.. నాలుగో ఓవర్లో  బోల్తా కొట్టించాడు. 

23 పరుగులకే ఓపెనర్లు నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన  కృనాల్ పాండ్యా  (11 బంతుల్లో  8, 1 ఫోర్).. విధ్వంసక బ్యాటర్   మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 40, 5 ఫోర్లు, 1 సిక్స్) తో జతకలిశాడు.  ఎదుర్కున్న రెండో బంతికే  బౌండరీతో ఖాతా తెరిచిన స్టోయినిస్.. గ్రీన్ వేసిన   ఐదో ఓవర్లో రెండో బాల్‌కు ఇచ్చిన క్యాచ్ ను  నెహల్ వధేర డ్రాప్ చేశాడు. దానికి ముంబై ఫలితం చెల్లించుకుంది. హృతీక్ షోకీన్ వేసిన  ఆరో ఓవర్లో స్టోయినిస్ 4, 4, 6  బాదాడు. స్టోయినిస్ కే ఎక్కువ  స్ట్రైక్ ఇచ్చిన   కృనాల్.. చావ్లా వేసిన   9వ ఓవర్లో   రెండో బాల్ కు  భారీ షాట్ ఆడబోయి  లాంగాన్ లో టిమ్ డేవిడ్ చేతికి చిక్కాడు.  దీంతో  46 పరుగుల  మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  

మధ్వాల్ మ్యాజిక్.. 

కృనాల్ నిష్క్రమించగానే అతడి స్థానంలో వచ్చిన  అయుష్ బదోని (1)  ఎక్కువసేపు నిలవలేదు.   ఇదే సమయంలో రోహిత్.. మధ్వాల్‌కు బాల్ ఇచ్చాడు.  అతడు వేసిన  పదో ఓవర్లో.. నాలుగో బాల్‌కు  అయుష్  క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  ఆ మరుసటి బంతికే  లక్నో కొండంత ఆశలు పెట్టుకున్న   నికోలస్ పూరన్  కూడా  వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

ముంచిన రనౌట్లు.. 

వరుసగా  రెండు వికెట్లు తీసి జోష్ లో ఉన్న ముంబైకి  లక్నో   టీమ్ బ్యాటర్ల  అనవసర తప్పిదాలు కలిసొచ్చాయి.  గ్రీన్ వేసిన  12వ  ఓవర్లో గ్రీన్ వేసిన ఐదో బంతిని మిడ్ వికెట్ దిశగా ఆడాడు.  అప్పటికే ఒక పరుగు పూర్తి చేసుకున్న   స్టోయినిస్ - హుడా లు రెండో పరుగు కోసం పరిగెత్తే క్రమంలో   ఒకరినొకరు ఢీకొన్నారు. సరిగ్గా అదే సమయానికి టిమ్ డేవిడ్ చాకచక్యంగా వ్యవహరించి వికెట్ కీపర్ వైపునకు విసిరాడు.  ఇషాన్ బెయిల్స్ ను పడగొట్టడంతో లక్నో ఆశలు ఆవిరయ్యాయి. స్టోయినిస్ రనౌట్ అయ్యాడు. మరుసటి ఓవర్లో   కృష్ణప్ప గౌతమ్ (2) ను కూడా రోహిత్ సూపర్ త్రో తో రనౌట్ చేశాడు.   రెండు రనౌట్లలో పాలు పంచుకున్న దీపక్ హుడా (15) కూడా   రనౌట్ గానే వెనుదిరిగాడు.  ఇక ఆ తర్వాత తోకను  కత్తిరించేందుకు ముంబై పెద్దగా కష్టపడలేదు.  రవి బిష్ణోయ్ (3) ను కూడా మధ్వాల్ ఔట్ చేశాడు. మోహ్సిన్ ఖాన్ ను బౌల్డ్ చేయడంతో మధ్వాల్  ఐదు వికెట్లు పడగొట్టి లక్నో ఓటమిని  పూర్తి చేశాడు.

 

అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్..  నిర్ణీత  20 ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి   182 పరుగులు చేసింది.   గ్రీన్ (41), సూర్యకుమార్ (33) తో పాటు ఆఖర్లో నెహల్  వధెర (23) మెరుపులతో  ముంబై   ఫైటింగ్ టోటల్ ను  లక్నో  ముందు ఉంచింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 4 వికెట్లతో చెలరేగాడు.