IPL 2023: క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి, గాయపడిన కేన్ విలియంసన్...  మోకాలికి తీవ్ర గాయం, బ్యాటింగ్‌కి రావడంపై అనుమానాలు.. 

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌కి ఊహించిన షాక్ తగిలింది. గుజరాత్ ప్లేయర్ కేన్ విలియంసన్, తీవ్రంగా గాయపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన భారీ షాట్‌ని బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ క్యాచ్‌గా మలిచిన కేన్ విలియంసన్, రోప్‌పైన పట్టు తప్ప పడిపోయాడు. పడిపోవడానికి ముందు బంతి లోపలికి విసిరేసినా అది మెల్లిగా బౌండరీ లైన్‌ని టచ్ చేసింది.. దీంతో రతురాజ్ గైక్వాడ్ ఖాతాలో బౌండరీ చేరింది..

క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కేన్ విలియంసన్ మోకాలికి తీవ్రంగా గాయమైంది. దీంతో నొప్పితో బాధపడిన కేన్ విలియంసన్, ఫిజియో సాయంతో మైదానం వీడాడు. కేన్ విలియంసన్ బ్యాటింగ్‌కి వస్తాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. కేన్ విలియంసన్ బ్యాటింగ్‌కి రాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్‌ని వాడి అతని ప్లేస్‌లో మరో కొత్త బ్యాటర్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2023 ఆరంభ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌, 17.1 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్‌ని ఫేస్ చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి పరుగు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు...

మొదటి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా హార్ధిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్ మొదటి బంతికే ఫోర్ బాదిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి బౌండరీ కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు.. 6 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసిన డివాన్ కాన్వేని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...

మహ్మద్ షమీకి ఇది 100వ ఐపీఎల్ వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత జోషువా లిటిల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి పరుగు, తొలి ఫోర్, తొలి సిక్సర్ కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు..

మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో 4, 6, 4 బాది 17 పరుగులు రాబట్టిన మొయిన్ ఆలీ, ఆ తర్వాత రషీద్ ఖాన్ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటైనా డీఆర్‌ఎస్ తీసుకోవడంతో నాటౌట్‌గా తేలాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన బెన్ స్టోక్స్, ఆ తర్వాత బంతికే సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 70 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది సీఎస్‌కే. ఆ తర్వాత అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..

అంబటి రాయుడు 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి, జోషువా లిటిల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...