Asianet News TeluguAsianet News Telugu

ముంబై ఇండియన్స్‌పై పగ తీర్చుకున్న హార్ధిక్ పాండ్యా... టైటాన్స్ చేతుల్లో రోహిత్ సేన చిత్తు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి నాలుగో ఓటమి... 40 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన నేహాల్ వదేరా!  చేతులు ఎత్తేసిన ముంబై టాపార్డర్, మిడిల్ ఆర్డర్.. 

IPL 2023: Gujarat Titans beats Mumbai Indians, Nehal Wadhera tried to CRA
Author
First Published Apr 25, 2023, 11:19 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాల తర్వాత వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. 2022 సీజన్‌లో తనను రిటైన్ చేసుకోని ముంబై ఇండియన్స్ టీమ్‌పై ఎట్టకేలకు పగ తీర్చుకున్నాడు హర్ధిక్ పాండ్యా. 208 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రోహిత్ సేన, 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ముంబై ఇండియన్స్‌కి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 8 బంతులాడి 2 పరుగులే చేసిన రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

21 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ని రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. 3 బంతుల్లో 2 పరుగులు చేసిన తిలక్ వర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా 26 బంతుల్లో 3 సిక్సర్లతో 33 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

టిమ్ డేవిడ్ కూడా నూర్ అహ్మద్ బౌలింగ్‌లో డకౌట్ కావడంతో 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. 12 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ముంబై ఓటమి దాదాపు ఖరారైపోయింది..

పియూష్ చావ్లా, నేహాల్ వదేరా కలిసి 24 బంతుల్లో 45 పరుగులు చేసి కాసేపు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. చివరి 3 ఓవర్లలో ముంబై ఇండియన్స్ విజయానికి 73 పరుగులు కావాల్సి వచ్చాయి. 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన పియూష్ చావ్లా... నేహాల్ కారణంగా రనౌట్ అయ్యాడు. 

దీంతో ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్‌ బ్యాటింగ్‌కి వచ్చాడు. 21 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన నేహాల్ వదేరా, మోహిత్ శర్మ బౌలింగ్‌లో మహ్మద్ షమీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 64 పరుగులు కావాల్సి వచ్చాయి. అప్పటికే ముంబై ఓటమి ఖారారైపోగా అర్జున్ టెండూల్కర్ ఓ సిక్సర్ బాది, 9 బంతుల్లో 13 పరుగులు చేసి ఆఖరి ఓవర్ నాలుగో బంతికి అవుట్ అయ్యాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, ముంబై బౌలర్లను ఓ ఆటాడుకుంటూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. అర్జున్ టెండూల్కర్, తన రెండో ఓవర్‌లో వృద్ధిమాన్ సాహాని అవుట్ చేసి టైటాన్స్‌కి షాక్ ఇచ్చాడు. 7 బంతుల్లో 4 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

14 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, పియూష్ చావ్లా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, కుమార్ కార్తీకేయ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 19 పరుగులు చేసిన విజయ్ శంకర్ కూడా పియూష్ చావ్లా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..
అయితే అభినవ్ మనోహార్, డేవిడ్ మిల్లర్ కలిసి ఐదో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టైటాన్స్‌కి భారీ స్కోరు అందించారు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన అభినవ్ మనోహార్, హాఫ్ సెంచరీకి ముందు అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, జాసన్ బెహ్రాడార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఆఖర్లో 5 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా, గుజరాత్ టైటాన్స్ స్కోరుకి 200 మార్కు దాటించాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios