Asianet News TeluguAsianet News Telugu

IPL 2023: బోణీ కొట్టిన గుజరాత్ టైటాన్స్... ఆఖరి ఓవర్ వరకూ సాగిన థ్రిల్లర్‌లో...

చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్.. ఆఖర్లో మెరుపులు మెరిపించిన రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా.. 

IPL 2023: Gujarat titans beats Chennai Super Kings, Rashid Khan, Shubman Gill cra
Author
First Published Mar 31, 2023, 11:41 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఘనంగా ప్రారంభమైంది. సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించింది. ఆఖరి ఓవర్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ 2023 సీజన్‌ని ఘనంగా ఆరంభించింది. సీఎస్‌కే విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది గుజరాత్ టైటాన్స్.. 


179 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కి శుభారంభం దక్కింది. 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సాహా, రాజ్‌వర్థన్ హంగర్కేర్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 


కేన్ విలియంసన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి వచ్చిన సాయి సుదర్శన్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి, రాజ్‌వర్థన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 11 బంతుల్లో 8 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అంబటి రాయుడి ప్లేస్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సీఎస్‌కే టీమ్‌లోకి వచ్చిన తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి గుజరాత్ టైటాన్స్ విజయానికి 30 బంతుల్లో 41 పరుగులు కావాలి..  మిచెల్ సాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే రాగా, దీపక్ చాహార్ వేసిన 17వ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు...

రాజ్‌వర్థన్ వేసిన 18వ ఓవర్ తొలి 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే వచ్చింది. అయితే నాలుగో బంతికి సిక్సర్ బాదిన విజయ్ శంకర్, ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన విజయ్ శంకర్‌, మిచెల్ సాంట్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

చివరి 2 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ విజయానికి 23 పరుగులు కావాల్సి వచ్చాయి. దీపక్ చాహార్ వేసిన 19వ ఓవర్‌లో లెగ్ బైస్ రూపంలో 4 పరుగులు రాగా రషీద్ ఖాన్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికి 6,  ఆ తర్వాతి బంతికి 4 బాదాడు. దీంతో 19వ ఓవర్‌లో 15 పరుగులు వచ్చేశాయి...

గుజరాత్ టైటాన్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి.. మొదటి బంతికి వైడ్ వేసిన తుషార్ దేశ్‌పాండే, ఆ తర్వాతి బంతికి సిక్సర్ సమర్పించాడు. భారీ సిక్సర్ బాదిన రాహుల్ తెవాటియా, ఆ తర్వాతి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు.. రషీద్ ఖాన్ 10, తెవాటియా 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. 

యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి పరుగు, తొలి ఫోర్, తొలి సిక్సర్, తొలి హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.  6 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసిన డివాన్ కాన్వేని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్...

మహ్మద్ షమీకి ఇది 100వ ఐపీఎల్ వికెట్. 17 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన బెన్ స్టోక్స్, ఆ తర్వాత బంతికే సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు బెన్ స్టోక్స్. అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..

అంబటి రాయుడు 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి, జోషువా లిటిల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

రవీంద్ర జడేజా 2 బంతుల్లో 1 పరుగు చేసి అల్జెరీ జోషఫ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన శివమ్ దూబే, మహ్మద్ షమీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఒకానొక దశలో 151/4 స్కోరుతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయి 163/7 స్థితికి చేరుకుంది. చివర్లో ధోనీ ఓ సిక్స్, ఫోర్ బాదడంతో చెన్నై స్కోరు 178కి చేరుకుంది.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios