IPL 2023: ఐపీఎల్ లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఐపీఎల్ లో మ్యాచ్ లు ముగిసిన వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు ఒక్క చోటుకు చేరి ముచ్చటించుకుంటుంటే మ్యాచ్ ను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మాత్రం పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రేక్షకులు గొడవకు దిగారు. ఢిల్లీ ఓడిపోతుందని కోపమో లేక మరేదో కారణమో గానీ ఢిల్లీ కుర్రాళ్లు మరోసారి వార్తల్లోకెక్కారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ గొడవ జరిగినట్టు తెలుస్తున్నది. ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగానే ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ పెద్దదై పొట్లాటకు దారితీసింది.
అయితే గొడవ ఎందుకు జరిగిందన్న విషయంపై క్లారిటీ లేకపోయినా సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఢిల్లీ ఓడిపోతుందన్న బాధతోనే ఆ జట్టు అభిమాని ఒకరు సన్ రైజర్స్ ఫ్యాన్ తో వాగ్వాదానికి దిగినట్టు చర్చ నడుస్తున్నది. వాస్తవానికి నిన్నటి మ్యాచ్ లో ఒక దశలో ఢిల్లీ గెలుపునకు దగ్గరగా వచ్చింది. 198 పరుగుల లక్ష్య ఛేదనలో మిచెల్ మార్ష్, ఫిలిప్ సాల్ట్ లు రాణించడంతో ఒకదశలో ఆ జట్టు 111-1 గా ఉంది. కానీ వరుస ఓవర్లలో మార్ష్, సాల్ట్, ప్రియమ్ గార్గ్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్ లు నిష్క్రమించడంతో ఢిల్లీ ఒత్తిడికి గురై విజయానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
చేతులదాకా వచ్చిన మ్యాచ్ చేజారిపోతుందనే కోపంతో ఢిల్లీ అభిమాని ఒకరు.. సన్ రైజర్స్ ఫ్యాన్ తో గొడవకు దిగాడని తెలుస్తున్నది. ముందు ఇద్దరి మధ్యే స్టార్ట్ అయిన గొడవకు తర్వాత మరో నలుగురు కలిశఆరు. దీంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు మ్యాచ్ ను పక్కనబెట్టి ఈ ముష్టి యుద్ధాన్ని ఆసక్తిగా వీక్షించారు. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి గొడవకు కారణమైన వారిని అక్కడ్నుంచి తీసుకెళ్లడంతో ప్రేక్షకులు మళ్లీ మ్యాచ్ లో లీనమయ్యారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (67), హెన్రిచ్ క్లాసెన్ (53) లు రాణించారు. అనంతరం ఢిల్లీ జట్టులో సాల్ట్ (59), మిచెల్ మార్ష్ (63) లు ధాటిగా ఆడినా ఒత్తిడిలో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 188 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
