ఐపీఎల్‌లో 58వ హాఫ్ సెంచరీ అందుకున్న డేవిడ్ వార్నర్.. మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న అక్షర్ పటేల్.. ముంబై ఇండియన్స్ ముందు 173 పరుగుల టార్గెట్.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మూడు మ్యాచుల్లో ఓడి హ్యాట్రిక్ నమోదు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయినా ఢిల్లీ ఆటలో మాత్రం మార్పు రావడం లేదు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు.. మొదటి మూడు మ్యాచుల్లో ఆదుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, నేటి మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, 19.4 ఓవర్లలో 172 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

గత మూడు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన పృథ్వీ షా, నేటి మ్యాచ్‌లో అదే సీన్ రిపీట్ చేశాడు. 10 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన పృథ్వీ షా, హృతీక్ షోకీన్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

వన్‌డౌన్‌లో వచ్చిన మనీశ్ పాండే 18 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న అండర్19 వరల్డ్ కప్ 2022 విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్, 4 బంతుల్లో 2 పరుగులు చేసి రిలే మెడరిత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

రోవ్‌మన్ పావెల్‌ 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లలిత్ యాదవ్ కూడా 4 బంతుల్లో 2 పరుగులు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 

98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ దశలో డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ కలిసి ఆరో వికెట్‌కి 35 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఆదుకున్నారు. 

జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ ఇచ్చిన క్యాచ్‌ని పట్టుకోవడంలో విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌కి తీవ్ర గాయమైంది. అక్షర్ కొట్టిన షాట్ నేరుగా వచ్చి సూర్యకుమార్ యాదవ్ ఎడమ కంటి మీద తగలింది. నొప్పితో విలవిలలాడిన సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ వీడాడు..

21 బంతుల్లో ఐపీఎల్‌లో మొటట్మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుుకన్న అక్షర్ పటేల్, 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేసి జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో అర్షద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఐపీఎల్ చరిత్రలో మొదటి హాఫ్ సెంచరీ చేయడానికి అత్యధిక ఇన్నింగ్స్‌లు వాడుకున్న రెండో ప్లేయర్‌గా నిలిచాడు అక్షర్ పటేల్..

ఇంతకుముందు రవీంద్ర జడేజా మొట్టమొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీ అందుకోవడానికి 131 ఇన్నింగ్స్‌లు తీసుకోగా అక్షర్ పటేల్ 91 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 47 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

వార్నర్ అవుటైన తర్వాతి బంతికే కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో అభిషేక్ పోరెల్, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మొదటి 2 ఓవర్లలో వికెట్ తీయలేకపోయిన జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీశాడు. రనౌట్ కూడా కావడంతో 19వ ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. 

20వ ఓవర్‌లో మూడో బంతికి ఫోర్ బాదిన నోకియా, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌కి తెరపడింది. 4 ఓవర్లలో 22 పరుగులిచ్చిన పియూష్ చావ్లా 3 వికెట్లు పడగొట్టాడు.