IPL 2023, CSK vs PBKS: ఐపీఎల్ -16లో  నేడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ స్వంత మైదానం చెన్నైలోని  చెపాక్‌లో  పంజాబ్ కింగ్స్‌ను ఢీకొంటున్నది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సీఎస్కే టాస్ గెలిచి  ఫస్ట్ బ్యాటింగ్  ఎంచుకుంది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సూపర్ సండే. ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లలో భాగంగా తొలుత చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరి పోరు జరుగనుంది. చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ధోని సారథ్యంలోని సీఎస్కే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ మొదలు ఫీల్డింగ్ చేయనుంది. 

పాయింట్ల పట్టికలో చెన్నై నాలుగో స్థానంలో ఉంది. రాజస్తాన్ తో మ్యాచ్ కు ముందు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఆ మ్యాచ్ లో ఓడటంతో నాలుగో స్థానానికి పడిపోయింది.ఇక నేటి మ్యాచ్ లో నెగ్గి టాప్ -2 కు దూసుకెళ్లాలని భావిస్తున్నది. 

మరోవైపు ఆడిన 8 మ్యాచ్ లలో నాలుగు గెలిచి నాలుగింట ఓడిన పంజాబ్ కింగ్స్ కూడా గత మ్యాచ్ లో లక్నో కొట్టిన దెబ్బ నుంచి కోలుకుని ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 

స్వంత మైదానంలో చెన్నై బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, ఎంఎస్ ధోనిలతో చెన్నైకి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ లో కూడా ఆ జట్టు అంతగా అనుభవం లేని ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మతీశ పతిరానలతో మెరుగైన ప్రదర్శనలు చేయిస్తున్నది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, తీక్షణ, మోయిన్ అలీలు చెన్నైలో టర్నింగ్ పిచ్ పై కీలకం అవుతారు. 

ఇక పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ కు చెన్నైపై మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ లో సీఎస్కేపై ధావన్ 28 మ్యాచ్ లలోనే 1,029 రన్స్ చేశాడు. ఈ క్రమంలో అతడి యావరేజ్ 44.73గా ఉంది. శిఖర్ ఐపీఎల్ లో ఒకే ఒక సెంచరీ చేస్తే అది కూడా సీఎస్కే మీదే ఉంది. 2020 సీజన్ లో సెంచరీ చేశాడు. చెపాక్ లో ధావన్ 9 మ్యాచ్ లు ఆడి 271 పరుగులు చేశాడు. ధావన్ కాకుండా ఈ సీజన్ లో తొలి మూడు మ్యాచ్ లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపులు మెరిపించాడు. కానీ తర్వాత విఫలమవుతున్నాడు. లక్నోత మ్యాచ్ లో రాణించిన అథర్వతో పాటు సికందర్ రజా, సామ్ కరన్, జితేశ్ శర్మలు ఓ చేయి వేస్తే పంజాబ్ కూడా భారీ స్కోరు చేయడం పక్కా. బౌలింగ్ లో ఆ జట్టు రబాడా, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరన్ వంటి పేసర్లతో పాటు రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రర్ వంటి స్పిన్నర్లతో ఉంది. చెపాక్ పేసర్ల కంటే స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తుంది. 

తుది జట్లు : 

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ తైడే, సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, కగిసొ రబాడా, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రర్

చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మోయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ, పతిరాన