IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16వ ఎడిషన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ లీగ్ లో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కంటే ముందే ఆరంభ వేడుకలు జరుగుతాయి.
ఐపీఎల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొద్ది గంటలలో ఈ లీగ్ అధికారికంగా మొదలుకానుంది. ఈ మేరకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కోవిడ్ తర్వాత మళ్ల ‘హోం అండ్ అవే’ పద్ధతిలో జరుగుతున్న ఈ లీగ్ లో శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ జెయింట్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నడుమ తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కు ముందు సుమారు గంటన్నర సేపు ఆరంభ వేడుకలు జరుగుతాయి.
ఐపీఎల్ లో చివరిసారిగా 2018 సీజన్ లో ప్రారంభ వేడుకలు జరిగాయి. 2019లో పూల్వామా దాడి ఘటన తర్వాత ఆ ఏడాది వీటిని నిర్వహించలేదు. ఇక 2020 నుంచి 2022 దాకా కోవిడ్ కారణంగా బీసీసీఐ వీటి జోలికి పోలేదు. కానీ ఈ ఏడాది మాత్రం ఆరంభ వేడుకలు అదిరేలా బీసీసీఐ ఘనమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ఘనంగా ఆరంభించిన బీసీసీఐ.. ఇక ఎంతో ప్రాచుర్యమున్న ఐపీఎల్ కు అంతకుమించి అనిపించేలా ఏర్పాట్లను చేస్తోంది.
ఎప్పుడు..? ఎవరెవరు..?
ఐపీఎల్ - 16 లో ఆరంభ వేడుకలు సాయంత్రం 6 గంటలకు మొదలవుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ (మొతేరా) స్టేడియంలో జరుగబోయే ఈ వేడుకల్లో బాలీవుడ్ తో పాటు దక్షిణాది తారలు కూడా మెరువనున్నారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తో పాటు నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన సౌత్ బ్యూటీ రష్మిక మందన్న, మిల్కీ బ్యూటీ తమన్నాలు తమ డాన్స్ తో అలరించనున్నారు. వీరితో పాటు టైగర్ ష్రాఫ్ కూడా మొతేరాను మోతిక్కించేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ తన గానా బజానాతో ముంచెత్తనున్నాడు. వీరేగాక మరికొందరు నటీనటులు కూడా ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.
ప్రత్యక్షంగా వీక్షించాలంటే..
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీని ప్రత్యక్షంగా వీక్షించాలంటే టికెట్లు ఇంకా ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. బుక్ మై షో, పేటీమ్ తో పాటు గుజరాత్ టైటాన్స్ వెబ్ సైట్స్ లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
టీవీలో అయితే..
ఆరంభ వేడుకలను ప్రత్యక్షంగా చూడటం వీలుకాకుంటే టీవీలో చూడొచ్చు. ఐపీఎల్ కు అధికారిక ప్రసారదారు (టెలివిజన్) గా ఉన్న స్టార్ నెట్వర్క్ (తెలుగులో ‘స్టార్ మా’) ఛానెల్స్ లో చూడొచ్చు.
ఆప్ లో ఇలా..
మొబైల్ ఫోన్లలో వీటిని చూడాలనుకుంటే ఐపీఎల్ డిజిటల్ మీడియా పార్ట్నర్ గా ఉన్న జియో సినిమాలో వీక్షించొచ్చు. జియో సినిమాస్ తో పాటు వూట్ యాప్ లో కూడా లైవ్ చూడొచ్చు.
