IPL 2023: టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుతం కామెంటేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆకాశ్ చోప్రా వచ్చే ఐపీఎల్ సీజన్ లో పలు మార్పులు చేయాలని సూచించాడు.
ఐపీఎల్ ను ప్రతీ ఏడాది గత సీజన్ కంటే మరింత రసవత్తరంగా మార్చేందుకు గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త కొత్త రూల్స్ ను ప్రవేశపెడుతూ ఈ లీగ్ ను ఆసక్తికరంగా మార్చుతున్నది. ఈ సీజన్ లో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్.. వైడ్, నో బాల్ కు డీఆర్ఎస్ తీసుకునే ఛాన్స్‌ను ఇచ్చే రూల్ ను ప్రవేశపెట్టింది.
అయితే ఈ లీగ్ ను మరింత రసవత్తరంగా చేయడంతో పాటు ప్లేఆఫ్స్ వెళ్లే క్రమంలో బాగా ఆడిన టీమ్ లకు బోనస్ పాయింట్లు ఇవ్వాలంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో రెండు మార్పులు చేయాలని ట్విటర్ వేదికగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
నేటి సీఎస్కే - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు ముందు ఆకాశ్ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘వచ్చే ఐపీఎల్ లో రెండు మార్పులు ఉంటే బావుంటుందని నేను భావిస్తున్నా. అందులో మొదటిది.. భారీ మార్జిన్ తో మ్యాచ్ లను గెలిచే జట్లకు బోనస్ పాయింట్లు ఇవ్వాలి. వాస్తవానికి ప్రస్తుతం మ్యాచ్ గెలిచిన జట్టుకు నెట్ రన్ రేట్ ద్వారా బెన్‌ఫిట్ ఉంది.. కానీ చాలామందికి ఇది అర్థం చేసుకోవడానికి వీలుగా లేదు. బోనస్ పాయింట్లు అయితే మ్యాచ్ ల మీద ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇక రెండో విషయం.. ఐపీఎల్ చివరి దశకు వచ్చేసరికి అన్ని మ్యాచ్ లను ఒకేసారి నిర్వహించాలి. ఉదాహరణకు ఈరోజు చెన్నై - ఢిల్లీ, లక్నో - కోల్కతా మ్యాచ్ లు ఉన్నాయి. చెన్నై మ్యాచ్ ఫలితాన్ని బట్టి లక్నోకు తాము ఎలా ఆడాలనేదానిపై క్లారిటీ వస్తుంది.
నెట్ రన్ రేట్ ఎంత.. తాము ఎంత చేయాలి..? ప్రత్యర్థిని ఎలా ఔట్ చేయాలి..? అనేది ఇతర జట్లకు అడ్వాంటేజ్ అవుతుంది. అలా కాకుండా చివరి దశ మ్యాచ్ లను ఒకేసారి జరిపించాలి. అప్పుడు ఏ జట్టు ఆట వాళ్లది అవుతుంది. నేటి ఢిల్లీ - చెన్నై, లక్నో - కోల్కతా మ్యాచ్ లే కాదు రేపటి ముంబై - హైదరాబాద్, బెంగళూరు - గుజరాత్ మ్యాచ్ లు కూడా ఇదే విధంగా అడ్వాంటేజీ పొందబోతున్నాయి..’ అని పేర్కొన్నాడు.
అయతే చోప్రా అభిప్రాయాలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీ ఆలోచన బాగానే ఉంది గానీ బోనస్ పాయింట్ల వల్ల తక్కువ మ్యాచ్ లు గెలిచిన జట్లకు నష్టం చేకూరే ప్రమాదం ఉంది. అంతేగాక మీరు రెండో దశలో చివరి మ్యాచ్ లను ఒకేసారి అన్నారు. చివరి దశ మ్యాచ్ లు అంటే ఏవి..? ఆఖరి నాలుగా..? లేక ఆఖరి ఏడు మ్యాచ్‌లా..? ఈ విషయంలో కాస్త స్పష్టత ఇస్తే బెటర్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
