IPL 2022 - MS Dhoni: మరో రెండు రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభమవుతుందనగా మార్చి 24న సారథ్య బాధ్యతల నుంచి ధోని వైదొలగడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ ను అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిపి మార్చి 24న సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ స్పెషల్ ట్రిబ్యూట్ ఇచ్చాడు. సీఎస్కేకు నాలుగు ట్రోఫీలు అందించిన ఈ దిగ్గజాన్ని అమరేంద్ర బాహుబలితో పోల్చాడు. రాజ్యాన్ని వదిలి సామాన్య జనంతో జీవించడానికి వస్తున్న బాహుబలి వలే ధోని కనిపిస్తున్నాడంటూ ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. 

ట్విట్టర్ వేదికగా జాఫర్ స్పందిస్తూ.. ‘ఎంఎస్ ధోని సీఎస్కే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని ఆ జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా ఉండబోతున్నాడు..’ అని రాసుకొచ్చాడు. ప్రభాస్ నటించిన బాహుబలి 2 చిత్రంలోని.. అమరేంద్ర బాహుబలి రాజ్యాన్ని వదిలి సామాన్య జనంతో బతకడానికి వెళ్లే సీన్ ఉన్న వీడియోను జోడించి పై వ్యాఖ్యలు చేశాడు జాఫర్.

Scroll to load tweet…

కాగా.. ధోని కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై టీమిండియా మాజీ సారథి కోహ్లి కూడా స్పందించాడు. ట్విట్టర్ ద్వారా కోహ్లి స్పందిస్తూ.. ‘లెజెండరీ కెప్టెన్సీ పదవీకాలం పూర్తయింది. ఈ అధ్యాయాన్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు...’ అని రాసుకొచ్చాడు. 

Scroll to load tweet…

2008లో ప్రారంభమైన ఐపీఎల్ లో ఆ సమయంలో అత్యంత ఖరీదైన ఆటగాడైన ధోని.. సీఎస్కే తరపున 204 మ్యాచులకు సారథ్యం వహించాడు. అతడి సారథ్యంలో చెన్నై 121 విజయాలు నమోదు చేసింది. 82 మ్యాచుల్లో ఓడింది. ధోని నాయకత్వంలోని చెన్నై.. 2010, 2011, 2018, 2021 లో ట్రోఫీలు గెలవగా,.. 2008, 2012, 2013, 2015, 2019 లో రన్నరప్ గా నిలిచింది. 2022 సీజన్ కు ముందు ధోని కెప్టెన్ గా తప్పుకుని రవీంద్ర జడేజా కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.