Asianet News TeluguAsianet News Telugu

Lucknow Franchise Name: లక్నో ఫ్రాంచైజీ పేరు ఇదే.. ట్విట్టర్లో ప్రకటించిన సంజీవ్ గొయెంకా..మళ్లీ అదే సెంటిమెంట్

Sanjeev Goenka Announced Lucknow Franchise Name: సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. ట్విట్టర్ వేదికగా ఓ పోల్ ను నిర్వహించింది. లక్నో  వాసులే తమ జట్టుకు పేరును సూచించాలని  కోరింది. ఈ నేపథ్యంలో... 
 

IPL 2022: RPSG Owner Sanjeev Goenka Announce Official Name Of Lucknow, To be Called As Lucknow Super Giants
Author
Hyderabad, First Published Jan 24, 2022, 9:18 PM IST

ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీకి పేరు ఖరారైంది. గతేడాది ఐపీఎల్ కొత్త బిడ్ ల  ప్రక్రియలో రూ. 7,090 కోట్లతో లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న అనంతరం.. ఆ జట్టుకు ఏం పేరు పెడతారా..? అని అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. ట్విట్టర్ వేదికగా ఓ పోల్ ను నిర్వహించింది. లక్నో  వాసులే తమ జట్టుకు పేరు సూచించాలని అభిమానులను కోరింది.  ఎట్టకేలకు సోమవారం సంజీవ్ గొయెంకా  ట్విట్టర్ లో  స్పందిస్తూ.. లక్నో  పేరును ‘లక్నో సూపర్ జెయింట్స్’ గా  ఖరారు చేసినట్టు ప్రకటించారు.   

లక్నో జట్టుకు  పేరు పెట్టడానికి ఆ ఫ్రాంచైజీ వినూత్న రీతిలో ప్రజల్లోకి వెళ్లింది. ఉత్తరప్రదేశ్ లోని  పురాతన కట్టడాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మన టీమ్ కు మీరే పేరు పెట్టండి...’అని  సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ నడిపింది. ఆ రకంగా  అప్పట్నుంచే ఉత్తరప్రదేశ్ వాసులతో మమేకమైంది. సుమారు 20 రోజుల క్యాంపెయిన్ అనంతరం.. సోమవారం సంజీవ్ గొయెంకా  ఆ పేరును వెల్లడించారు. 

 

ట్విట్టర్ లో ఆయన మాట్లాడుతూ... ‘లక్నో ఫ్రాంచైజీకి పేరు పెట్టడానికి గాను మేము సోషల్ మీడియాలో ఓ  పోల్ నిర్వహించాము. దానికి మాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ట్విట్టర్,  ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్,  తదితర  సామాజిక మాధ్యమాల నుంచి  వచ్చిన పేర్ల నుంచి అత్యంత ప్రజాధరణ  పొందిన పేరు లక్నో సూపర్ జెయింట్స్..’ అని వెల్లడించారు. 

 

కెఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు  జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు.  ముగ్గురు ఆటగాళ్ల ఎంపికలో భాగంగా ఇటీవలే ఆ జట్టు కెఎల్ రాహుల్ తో పాటు మార్కస్ స్టాయినిస్ (ఆస్ట్రేలియా), రవి బిష్ణోయ్ లను దక్కించుకుంది. మిగిలిన జట్టును తయారుచేసుకోవడానికి ఫిబ్రవరి 12, 13వ తేదీలలో బెంగళూరులో జరిగే ఐపీఎల్  వేలం కోసం వేచి చూస్తున్నది. 

అదే పేరు.. ఊరు మారింది.. 

కాగా లక్నో కొత్త పేరుపై భారీ అంచనాలుండేవి. ఎంతో చరిత్ర కలిగిన లక్నో నగరంతో పాటు ఉత్తరప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కొత్త పేరు ఉంటుందని అందరూ ఆశించారు.  కానీ లక్నో ఫ్రాంచైజీ మాత్రం తమ పాత జట్టు ‘రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్’  లో ఊరు పేరు మాత్రమే మార్చింది. 2016, 2017లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మీద నిషేధంతో  లీగ్ లోకి వచ్చిన పూణెకు కూడా సంజీవ్ గొయెంకానే ఓనర్. ఆ సమయంలో ఆయన పూణెకు పెట్టిన సూపర్ జెయింట్స్ నే మళ్లీ లక్నోకు తగిలించడం గమనార్హం.  

2016 లో ఆ జట్టు ఏడో స్థానంతో సరిపెట్టుకోగా.. 2017లో ఐపీఎల్ లో పూణె  ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.  ఆఖరు పోరులో ఆ జట్టు.. ముంబయి ఇండియన్స్ చేతిలో  ఓడింది. కానీ ఆ సీజన్ లో పూణె.. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఇదే సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందని గొయెంకా మళ్లీ అదే పేరు పెట్టి ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్లు  వినిపిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios