Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: బెంగళూరు ఓపెనర్లు భళా.. ఆఖర్లో దినేశ్ కార్తీక్ దూకుడు.. చెన్నై ముందు భారీ లక్ష్యం

TATA IPL 2022 RCB vs CSK: వరుసగా మూడు మ్యాచులలో విఫలమైన బెంగళూరు బ్యాటర్లు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో బాధ్యాతయుతంగా ఆడారు. ముందుగా ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ విజృంభించగా ఆఖర్లో దినేశ్ కార్తీక్, లోమ్రర్ దంచికొట్టారు. 

IPL 2022: Royal challengers Bangalore sets 174 Target to Chennai Super Kings
Author
India, First Published May 4, 2022, 9:08 PM IST | Last Updated May 4, 2022, 9:13 PM IST

ప్లేఆఫ్ రేసులో వెనుకబడి వరుసగా మూడు మ్యాచులలో ఓడిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నైతో మ్యాచ్ లో బ్యాటింగ్ లో సమిష్టి గా రాణించింది. చెన్నై బౌలర్లను తొలి నుంచే ధీటుగా ఎదుర్కున్న  బెంగళూరు బ్యాటర్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173  పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ తో పాటు చివర్లో మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్ లు రాణించారు. చెన్నై బౌలర్లలో  మహేశ్ తీక్షణ, మోయిన్ అలీ  బెంగళూరును కట్టడి చేశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లి (33 బంతుల్లో 30.. 3 ఫోర్లు, 1 సిక్సర్), డుప్లెసిస్ (22 బంతుల్లో 38.. 4 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడారు. ఓవర్ కో బౌండరీ, సిక్సర్ చొప్పున బాదిన ఈ ఇద్దరూ.. 5 ఓవర్లలోనే ఆర్సీబీ స్కోరును 51 పరుగులకు చేర్చారు.తొలి వికెట్ కు ఈ ఇరువురూ 7.2 ఓవర్లలో 62 పరుగులు జోడించారు. 

మూడు వికెట్లు టపటప.. 

అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన మోయిన్ అలీ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన డుప్లెసిస్.. డీప్ మిడ్ వికెట్ వద్ద ఉన్న జడేజాకు  క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన జడేజా బౌలింగ్ లో ఐదో బంతికి అనవసరపు పరుగుకు యత్నించిన గ్లెన్ మ్యాక్స్వెల్ (3) రనౌట్ అయ్యాడు. మోయిన్ అలీ వేసిన 9వ ఓవర్లో ఐదో బంతికి  విరాట్ కోహ్లి బౌల్డ్ అయ్యాడు.

ఐదు ఓవర్లకు 50 పరుగులు చేసిన ఆర్సీబీ.. తర్వాత ఐదు ఓవర్లలో 29 పరుగులే చేసి మూడు కీలక వికెట్లు  కోల్పయింది. ఆ తర్వాత ఆర్సీబీ స్కోరు మరీ నెమ్మదించింది. ఇక వరుసగా 3 వికెట్లు కోల్పోయాక క్రీజులోకి వచ్చిన లోమ్రర్ (27 బంతుల్లో 42.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. గత మ్యాచ్ లో దూకుడుగా ఆడి హాఫ్  సెంచరీ చేసిన  రజత్ పాటిదార్ (15 బంతుల్లో 21.. 1 ఫోర్, 1 సిక్సర్) తో కలిసి నాలుగో వికెట్ కు 44 పరుగులు జోడించాడు. పాటిదార్ జోరు మీద కనిపించినా.. ప్రిటోరియస్ వేసిన 15.1 ఓవర్లో ముఖేశ్ చౌదరికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ప్రిటోరియస్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో   4, 6  బాదిన లోమ్రర్.. 19వ ఓవర్ వేసిన మహేశ్ తీక్షణ బౌలింగ్ లో గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చాడు. 

 

19వ ఓవర్లో ఆర్సీబీ ఏకంగా మూడు వికెట్లను కోల్పోయింది. తొలి బంతికి లోమ్రర్ ఔట్ కాగా.. రెండో బంతికి హసరంగ గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆఖరి బంతికి తీక్షణ.. షాబాజ్ అహ్మద్ (1) ను పెవిలియన్ కు పంపాడు. అయితే ఆఖర్లో దినేశ్ కార్తీక్ (17 బంతుల్లో 26.. 1 ఫోర్, 2 సిక్సర్లు ) దూకుడుగా ఆడాడు. ప్రిటోరియస్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాదాడు. ఆర్సీబీ  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 

చెన్నై బౌలర్లలో   స్పిన్నర్ తీక్షణ 3 వికెట్లు తీయగా.. మోయిన్ అలీ 2, ప్రిటోరియస్ 1 వికెట్ పడగొట్టాడు.  చెన్నై విజయానికి 20 ఓవర్లలో 174 పరుగులు కావాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios