ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఉగ్రదాడి పొంచి ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్... వదంతులను నమ్మొద్దంటూ కొట్టిపారేసిన మహారాష్ట్ర ప్రభుత్వం...
సినీ ఫ్యాన్స్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 15ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారా?
మహారాష్ట్రలోని ముంబై, పూణే వేదికలుగా ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ మ్యాచులన్నీ జరగనున్న విషయం తెలిసిందే. కరోనా ప్రోటోకాల్ కారణంగా ఈ మ్యాచ్‌లకు 25 నుంచి 50 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్...
ఐపీఎల్ ఆరంభానికి కొన్ని గంటల ముందు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటకే ఐపీఎల్ 2022 సీజన్ కోసం ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఎంసీఏ.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగే ఆరంభ మ్యాచ్‌తో ఐపీఎల్ 2022 సీజన్ సందడి మొదలు కానుంది. ఈ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఐపీఎల్‌కి టెర్రర్ అటాక్ జరిగే అవకాశం ఉందంటూ ఓ వార్త, క్రికెట్ ఫ్యాన్స్‌కి కలవరపెట్టింది...
అయితే ఈ వార్తలో నిజం లేదని, ఇది కేవలం ఓ పుకారు మాత్రమే అంటూ కొట్టిపారేశాడు మహారాష్ట్ర హోం మినిస్టర్. ముందు జాగ్రత్తగా ఐపీఎల్ మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకులకు మరిన్ని ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర సర్కార్...
ఐపీఎల్ టీమ్ బస్సులకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. టీమ్ బస్సుల ముందు కంబాట్ వెహికల్స్‌తో ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ముంబైలో ప్లేయర్లు బస చేసే హోటల్స్ దగ్గర కఠిన నిబంధనలు అమలులో ఉంటాయి. బయో బబుల్ జోన్‌లోనికి బయటి వ్యక్తులకు అనుమతి ఉండదు...
అలాగే హోటల్ పరిసరాల్లో కూడా ఎవ్వరూ కార్లను, బైకులను పార్క్ చేయడానికి అనుమతి ఉండదు. ఐపీఎల్ ముగిసే వరకూ ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్‌తో పాటు బస్సు డ్రైవర్లు, క్లీనర్లు, గ్రౌండ్ స్టాఫ్, మిగిలిన సహాయక సిబ్బంది కూడా బయో బబుల్ జోన్‌ని వీడడానికి వీలు లేదు. ఒకవేళ సెక్యూర్ జోన్‌ని బయటికి వెళితే, వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి, ఆ తర్వాతే బయో బబుల్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది...
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో బయో బబుల్‌లో కరోనా కేసులు వెలుగుచూడడంతో భారత క్రికెట్ బోర్డు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. మల్టీపుల్ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ని మధ్యలో ఆపేసి, సెప్టెంబర్‌లో మిగిలిన మ్యాచులు నిర్వహించాల్సి వచ్చింది. గత సీజన్ అనుభవాలతో ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ...
విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ కెప్టెన్‌గా తప్పుకోవడం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి ఎమ్మెస్ ధోనీ వీడ్కోలు పలకడంతో పాటు సురేష్ రైనా, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, ‘మిస్టర్ 360 డిగ్రీస్’ ఏబీ డివిల్లియర్స్ లేకుండా జరిగే ఐపీఎల్ 2022 సీజన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి...
