ఐపీఎల్ 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... 8వ స్థానంలో ఉన్న కేకేఆర్‌కి కీలకంగా మారిన విజయం... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది... 

మదర్స్ డే ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో ప్రపంచ తల్లులకు ధన్యవాదాలు తెలుపుతూ, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్లు అందరూ తల్లుల పేర్లతో ఉన్న జెర్సీలతో నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతుండడం విశేషం... 

10 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కోల్‌కత్తా ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. మరోవైపు ఏ మాత్రం అంచనాలు లేకుండా ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించిన కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్, 10 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉంది...

నేటి మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది లక్నో సూపర్ జెయింట్స్. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తర్వాత ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న రెండో జట్టుగా నిలుస్తుంది.

లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి వస్తుండగా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పాటు దీపక్ హుడా బ్యాటుతో అదరగొడుతుంటే... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మోహ్‌సిన్ ఖాన్ 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. అతనితో పాటు రవి భిష్ణోయ్, కృనాల్ పాండ్యా బంతితో రాణిస్తున్నారు...

గత సీజన్‌లో కేకేఆర్‌కి మ్యాచ్‌ విన్నర్‌గా మారిన వెంకటేశ్ అయ్యర్‌, ఈ సీజన్‌లో ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాడు. అతనితో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఫెయిల్ అవ్వడం కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టును తీవ్రంగా వేధిస్తోంది. శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణాలతో పాటు గత మ్యాచ్‌లో రింకూ సింగ్ బ్యాటుతో అదరగొట్టాడు...

బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ మాత్రమే కేకేఆర్‌కి వికెట్ టేకర్లుగా మారారు. సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా, వికెట్లు తీయడంలో వెనకబడ్డాడు. బ్యాటుతో అయితే ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఆండ్రే రస్సెల్ కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపించినా, ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, కెఎల్ రాహుల్, దీపక్ హుడా, మార్నస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోనీ, జాసన్ హోల్డర్, దుస్మంత ఛమీరా, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, మోహ్సీన్ ఖాన్

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: ఆరోన్ ఫించ్, బాబా ఇంద్రజిత్, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, ఆండ్రే రస్సెల్, టిమ్ సౌథీ, సునీల్ నరైన్, శివమ్ మావి, హర్షిత్ రాణా