Asianet News TeluguAsianet News Telugu

IPL 2022 CSK vs GT: రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ... గుజరాత్ టైటాన్స్ ముందు ఈజీ టార్గెట్...

సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్... జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్...

IPL 2022 CSK vs GT:  Ruturaj Gaikwad half century, Chennai Super Kings failed to score huge
Author
India, First Published May 15, 2022, 5:26 PM IST | Last Updated May 15, 2022, 5:26 PM IST

ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, మరో మ్యాచ్ ఓడినా పోయేదేమీ లేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి, టేబుల్ టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓ మ్యాచ్‌ ఓడితే, కలిగే నష్టమేమీ లేదు. ఒరిగేదేమీ లేనప్పుడు పోరాడితే మాత్రం ఏం లాభం అనుకున్నారో ఏమో... చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయడానికి పెద్ద కష్టపడలేదు. సీఎస్‌కే బ్యాటర్ల అలసత్వం, గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో లో స్కోరింగ్ గేమ్ నమోదైంది... 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. 9 బంతుల్లో 5 పరుగులు చేసిన డివాన్ కాన్వే, మహ్మద్ షమీ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది సీఎస్‌కే...

మొయిన్ ఆలీతో కలిసి రెండో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రుతురాజ్ గైక్వాడ్. 17 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, సాయి కిషోర్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

మరో ఎండ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2022 సీజన్ ఫస్టాఫ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి సెకండాఫ్‌లో ఇది మూడో హాఫ్ సెంచరీ. 

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 10వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్‌లో 35 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 35 ఐపీఎల్ ఇన్నింగ్స్‌‌ల తర్వాత 1170 పరుగులు చేయగా, రుతురాజ్ గైక్వాడ్ 1205 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. రిషబ్ పంత్ 1085 పరుగులు చేసి టాప్ 3లో ఉన్నాడు...

 49 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే శివమ్ దూబే 2 బంతులాడి డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 16, 17, 18, 19, 20 ఓవర్లలో ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్... ఫలితంగా సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే వచ్చాయి.

ఎమ్మెస్ ధోనీ వంటి భారీ హిట్టర్ కూడా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 10 బంతుల్లో 7 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మూడో బంతికి మహ్మద్ షమీ బౌలింగ్‌లో యష్ దయాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...  సీజన్‌లో మొదటి సారి తుది జట్టులో చోటు దక్కించుకున్న ఎన్ జగదీశన్, 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios