ఐపిఎల్ 2021 ప్రారంభమవుతున్న దశలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురు దెబ్బ తగిలింది. జట్టు కీలక ఆటగాడు అక్షర్ పటేల్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతన్ని ఐసోలేషన్ కు తరలించారు.
చెన్నై: ఐపిఎల్ 2021 టోర్నమెంట్ ప్రారంభమయ్యే దశలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు అక్షర్ పటేల్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. దాంతో నిబంధనల మేరకు అతడ్ని ఐసోలేషన్ కు తరలించినట్లు సమాచారం.
దురదృష్టవశాత్తు అక్షర్ కు పాజిటివ్ వచ్చిందని, అతను ఐసోలేషన్ లో ఉన్నాడని, కరోనా నిబంధనలూ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నామని ఢి్లలీ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. మార్చి 28వ తేదీన అక్షర్ కు నెగెటివ్ రావడంతో జట్టులో చేరాడు. రెండోసారి చేసిన ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్ వచ్చింది.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అక్షర్ కన్నా ముందు కోల్ కతా ఆటగాడు నితీష్ రాణాకు కోవిడ్ సోకింది. మార్చి 22వ తేదీన పాజిటివ్ రావడంతో రాగా, గురువారంనాడు నెగెటివ్ వచ్చింది.
ఆటగాళ్లకు పాజిటివ్ వస్తే నిబంధనల మేరకు వారిని బయో బబుల్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. పది రోజులు ప్రత్యేకంగా ఐసోలేషన్ కు పంపించాలి. రోజూ జట్టు వైద్యులు పర్యవేక్షించాలి. ఐసోలేషన్ లో ఉన్నప్పుడు బాధితులు ఏ విధమైన శారీరక వ్యాయామం కూడా చేయకూడదు.
ఇదిలావుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండుతో జరిగి మ్యాచులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను ఐపిఎల్ కు దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు.
