త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆలస్యం అయ్యింది. అయితే.. ఎట్టకేలకు తగిన జాగ్రత్తలతో దుబాయిలో సీజన్  కి తగిన ఏర్పాట్లు చేశారు. మరి కొద్ది రోజుల్లో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వివిధ అంశాలపై మాట్లాడారు.

గత సీజన్ లో తమ జట్టు మెరుగైన ప్రదర్శన కనపరిచిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీసీఐతో పాటు తమ ఫ్రాంచైజీ కూడా రూపొందించిన బయో సెక్యూర్‌ బబుల్‌ నిబంధనలు సరైన దిశలో ఉన్నాయని ఆయన అన్నారు.  వాటిని తామందరం కచ్చితంగా పాటిస్తున్నాయన్నిరు. రిసార్ట్‌ ఉద్యోగులు, డ్రైవర్‌ కూడా బబుల్‌లో భాగమేనన్నారు.  ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లకు స్పష్టత ఉందన్నారు. ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలకు హాజరవుతున్నామని చెప్పారు. ట్రాకర్‌ కూడా అందరం ధరిస్తున్నామని చెప్పారు.

కాగా.. తమ సన్ రైజర్స్ జట్టు ఆటకి పూర్తిగా సన్నద్ధమైందని ఆయన చెప్పారు. గత ఏడాది తమ జట్టు టాప్ 4లో నిలిచిందని చెప్పారు. వార్నర్, బెయిర్‌ స్టో చాలా బాగా ఆడారని గుర్తు చేసుకున్నారు. అయితే అదే చివరకు మిడిలార్డర్‌కు తగినంత అవకాశం రాకుండా చేసిందన్నారు.

 వారు తిరిగి వెళ్లిపోగానే జట్టు బలహీనంగా కనిపించిందని  చెప్పారు.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వేలానికి వెళ్లామన్నారు. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభావంతులైన కుర్రాళ్లను ఎంపిక చేసుకున్నామని చెప్పారు.

 ప్రియమ్‌ గార్గ్, సమద్, విరాట్‌ సింగ్, సందీప్, సంజయ్‌ యాదవ్‌లు సత్తా చాటుతారనే నమ్మకం ఉందన్నారు. ఈ సారి సీనియర్‌ మనీశ్‌ పాండేపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. అతనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడన్నారు. పాండేకు తోడుగా విజయ్‌ శంకర్‌ మిడిలార్డర్‌లో ఉన్నాడని చెప్పారు.