అబుదాబీ: బౌండరీ వద్ద కేన్ విలియమ్సన్ కొట్టిన బంతిని దేవదత్ పడిక్కల్ పట్టుకుని ఉంటే ఆట మలుపు తిరిగి ఉండేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాదు మీద జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో బెంగళూరు ఓటమి పాలైన విషయం తెలిసిందే. 

కేన్ విలియమ్సన్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద పడిక్కల్ రెండు చేతులతో అందుకున్నాడు. అయితే, బ్యాలెన్స్ తప్పి బౌండరీ వెలుపలికి తాను వెళ్లే ప్రమదాం కనిపించడంతో బంతిని బౌండరీ లోపలికి విసిరేశాడు. అయితే, దాంతో పడిక్కల్ ఐదు పరుగులు రాకుండా చేయగలిగాడు. 

తాము సన్ రైజర్స్ హైదరాబాదు ముందు భారీ లక్ష్యాన్ని పెట్టలేకపోయామని కోహ్లీ అన్నాుడు. కేవలం 131 పరుగులు మాత్రమే చేసి హైదరాబాదు ముందు 132 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

సన్ రైజర్స్ హైదరాబాదు విజయంలో కేన్ విలియమ్న్ కీలక పాత్ర పోషించాడు. ఐపిఎల్ లో అతను 14వ అర్థ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 44 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

20 ఏళ్ల పడిక్కల్ ను కోహ్లీ ప్రశంసించాడు. టోర్నీ యావత్తు బాగా రాణించాడని చెప్పాడు. ఆర్సీబీ బ్యాట్స్ మెన్ ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 15 మ్యాచుల్లో 473 పరుగులు చేశాడు. పడిక్కల్ అత్యంత సామర్థ్యాన్ని ప్రదర్శించాడని, క్లాస్ బ్యాటింగ్ ప్రదర్శన చేశాడని, ప్రతిసారీ 400కు పైగా పరుగులు సాధించడం అంత సులభం కాదని, అయితే పడిక్కల్ అది సాధించాడని ఆయన అన్నాడు.