Asianet News TeluguAsianet News Telugu

IPL 2020 RCB VS SRH ఎలిమినేటర్ లో ఇరు జట్ల విజయ వ్యూహం ఇదే...

ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫోకస్‌ ప్రధానంగా రాయల్ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే ఉండటం సహజం. ఈ ఇద్దరి మెరుపులపైనే బెంగళూర్‌ సక్సెస్‌ ఫార్ములా దాగి ఉంది. అయినా, సన్‌రైజర్స్ బౌలర్లు తొలుత పడగొట్టాల్సిన బ్యాట్స్‌మన్‌ ఒకరున్నారు. అతడే దేవ్‌దత్‌ పడిక్కల్‌.

IPL 2020 SRH VS RCB Eliminator Match Prediction, Strategy Of Each Team Explained SRH
Author
Hyderabad, First Published Nov 6, 2020, 6:04 PM IST

ఐపీఎల్‌ 2020 ప్లే ఆఫ్స్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్‌లో టైటిల్‌ రేసు నుంచి ఓ జట్టు నేడు ఎలిమినేటర్‌తో తప్పుకోనుంది. ఆఖరు మూడు మ్యాచుల్లో అద్వీతియ విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌లో ఫేవరేట్‌గా ఆడుతోంది.  

గత నాలుగు మ్యాచుల్లో దారుణ పరాజయాలు చవిచూసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ప్లే ఆఫ్స్‌ను కొత్తగా ఆరంభించేందుకు ఎదురుచూస్తోంది.  హైదరాబాద్‌, బెంగళూర్‌ ఎలిమినేటర్‌లో విజేతను నిర్ణయించే వ్యూహలు ఇవే.

పడిక్కల్‌ను పడగొట్టాలి

ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫోకస్‌ ప్రధానంగా రాయల్ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే ఉండటం సహజం. ఈ ఇద్దరి మెరుపులపైనే బెంగళూర్‌ సక్సెస్‌ ఫార్ములా దాగి ఉంది.

అయినా, సన్‌రైజర్స్ బౌలర్లు తొలుత పడగొట్టాల్సిన బ్యాట్స్‌మన్‌ ఒకరున్నారు. అతడే దేవ్‌దత్‌ పడిక్కల్‌.  లీగ్‌ దశలో రాయల్‌ చాలెంజర్స్ బెంగళూర్‌ సాధించిన ఏడు విజయాల్లో దేవ్‌దత్‌ పడిక్కల్‌దే కీలక పాత్ర.  ఐపీఎల్‌లో ఓ అరంగేట్ర ఆటగాడు అత్యధిక పరుగులు చేసిన ఘనత పడిక్కల్‌దే. బెంగళూర్‌ గెలుపొందిన ఏడు మ్యాచుల్లో 125.20 స్ర్టయిక్‌రేట్‌తో పడిక్కల్‌ 298 పరుగులు చేశాడు పడిక్కల్‌.

పడిక్కల్ భరతO పట్టేందుకు సన్‌రైజర్స్‌కు సందీప్‌ శర్మ రూపంలో పదునైన అస్ర్తం అందుబాటులో ఉంది.  పవర్‌ ప్లేలో సందీప్‌ శర్మ తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. అందులో నలుగురు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు.

లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు సందీప్‌ 54 బంతుల్లో 57 పరుగులే ఇచ్చాడు. స్వింగ్‌ అండ్‌ స్లో బాల్స్‌ సందీప్‌ శర్మ ప్రధాన ఆయుధాలు.  పడిక్కల్‌కు షార్ట్‌ బంతులు ఆడటంలో బలహీనత ఉంది. ఆ బంతులపై 48 బంతుల్లో 46 పరుగులే చేశాడు. రెండు సార్లు వికెట్‌ కోల్పోయాడు. బౌన్సర్లు సంధించేందుకు జేసన్‌ హోల్డర్‌ను పవర్‌ప్లేలో ప్రయోగించే అవకాశం లేకపోలేదు.

సందీప్‌ను పవర్‌లోనే కొట్టాలి!:

హైదరాబాద్‌ ప్రధాన పేసర్‌ సందీప్‌ శర్మ పవర్‌ ప్లేలోనే ఏకంగా మూడు ఓవర్లు వేస్తాడు. మిడిల్‌ ఓవర్లలో సందీప్‌ శర్మ ఏడు ఓవర్లు వేశాడు. మిడిల్‌ ఓవర్లలో సందీప్‌ శర్మ ఎకానమీ 6.85. డెత్‌ ఓవర్లో సందీప్‌ శర్మ తొమ్మిది ఓవర్లు వేయగా.. 10.44 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు.

రాయల్‌ చాలెంజర్స్‌ టాప్‌ ఆర్డర్‌ పవర్‌ ప్లేలోనే సందీప్‌ శర్మపై ఎదురుదాడి చేయగలిగితే.. హైదరాబాద్‌ బౌలింగ్‌ ప్రణాళికలు మారతాయి. సందీప్‌ శర్మ ఓవర్లను హైదరాబాద్‌ మిడిల్‌ లేదా డెత్‌ ఓవర్లకు మార్చుకుంటుంది.  సందీప్‌ శర్మ ఆధిపత్యం చెలాయించకుండా చేస్తే.. హైదరాబాద్‌ బౌలింగ్‌ వ్యూహం మారుతుంది.

సందీప్‌ను కోహ్లి దాటగలడా?

ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని సందీప్‌ శర్మ ఏడు సార్లు అవుట్‌ చేశాడు. మరే బౌలర్‌ విరాట్‌ను ఇన్ని సార్లు అవుట్‌ చేయలేదు. సందీప్‌ శర్మ ఫుల్‌ లెంగ్త్‌, షార్ట్‌ బంతులు సంధిస్తే కోహ్లి అలవోకగా పరుగులు సాధిస్తాడు.

కానీ గుడ్‌ లెంగ్త్‌ బంతులు వేస్తే.. విరాట్‌ను ఇరకాటంలో పడేయవచ్చు. గుడ్‌ లెంగ్త్‌ బంతులతో విరాట్‌ను సందీప్‌ శర్మ ఐదు సార్లు అవుట్‌ చేశాడు. 23 బంతుల్లో 17 పరుగులే ఇచ్చాడు.  

సందీప్‌ శర్మ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి చెత్త బంతుల కోసం ఎదురుచూడాలి. లేదేంటే మరో మార్గం కోసం ఓపిగ్గా అన్వేషించాలి. రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మలపై ఆశావహ గణాంకాలు లేని విరాట్‌ ఇతర బౌలర్లపై దాడి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలి. ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లికి 50 బంతుల్లో 69 పరుగులు ఇచ్చిన సందీప్‌ శర్మ 9.85 సగటుతో ఏడు సార్లు అవుట్‌ చేశాడు.

రషీద్‌ ఖాన్‌ వర్సెస్‌ డివిలియర్స్‌...

రషీద్‌ ఖాన్‌ను ఎదుర్కొనేందుకు విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లు ఇద్దరూ ఇబ్బంది పడతారు. మిడిల్‌ ఆర్డర్‌లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌కు వచ్చే తరుణంలో క్రీజులో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ వికెట్‌ భీతితో ఉంటరని చెప్పవచ్చు.

రషీద్‌ ఖాన్‌ గూగ్లీలకు కోహ్లి తడబడుతున్నాడు. రషీద్‌పై 19 బంతుల్లో 18 పరుగులే చేసి ఓ సారి వికెట్‌ కోల్పోయాడు. అదే డివిలియర్స్‌ 25 బంతుల్లో 25 పరుగులు చేసి రెండు సార్లు రషీద్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు.  

బెంగళూర్‌ భారీ స్కోరు చేయాల్సి వచ్చినా.. భారీ స్కోరు ఛేదించాల్సి వచ్చినా విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లు ఆఖరు వరకు ఆడాల్సి ఉంటుంది. ఆ సమయంలో, రషీద్‌ ఖాన్‌ నాలుగు ఓవర్లను కాచుకోవటం బెంగళూర్‌కు కత్తి మీద సామే.

వార్నర్‌-సాహా దూకుడుతో జాగ్రత్త!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లీగ్‌ దశలో చివరి ఏడు మ్యాచుల్లో పవర్‌ప్లేలో 9.50 సగటుతో పరుగులు సాధించింది. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ ఎదురుదాడి. వృద్దిమాన్‌ సాహా తోడుగా గత మూడు మ్యాచుల్లో డెవిడ్‌ వార్నర్‌ తిరిగి తన దూకుడు ప్రదర్శించాడు.  వార్నర్‌, సాహా జోడీ గత మూడు మ్యాచుల్లో 268 పరుగులు చేసింది. 9.51 రన్‌రేట్‌తో 134 సగటుతో ఈ జోడీ జైత్రయాత్ర సాగించింది.

2016 నుంచి ఓ స్పిన్నర్‌కు వార్నర్‌ వికెట్‌ కోల్పోలేదు. కానీ, గత మ్యాచ్‌లో బెంగళూర్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు వికెట్‌ ఇచ్చాడు. సుందర్‌పై వరుసగా రెండో భారీ సిక్సర్‌కు వెళ్లిన వార్నర్‌ మూల్యం చెల్లించుకున్నాడు. నేడూ సుందర్‌ను పవర్‌ప్లేలో ప్రయోగించేందుకు కోహ్లి సిద్ధంగానే ఉంటాడని చెప్పవచ్చు.

టాస్ నెగ్గు.. టార్గెట్‌ ఛేదించు!:

అబుదాబిలో జరిగిన చివరి ఐదు మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టునే విజయం వరించింది.  ఓవరాల్‌గా ఈ వేదికపై 20 మ్యాచుల్లో 12 సార్లు ఛేదించిన జట్టే గెలుపొందింది.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఇక్కడ నాలుగు మ్యాచుల్లో ఓడింది. అందులో గత వారంలోనే రెండు ఓటములు ఉన్నాయి. అబుదాబిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మూడు మ్యాచులో ఆడగా.. ఒక్క విజయం సాధించింది. రెండు ఓటముల్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో సూపర్‌ ఓవర్‌ పరాజయం ఒకటి.

Follow Us:
Download App:
  • android
  • ios