దుబాయ్: ఐపిఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సందర్భంగా ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. తాజాగా, సీనియర్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద జరిగిన మ్యాచు సందర్బంగా అశ్విన్ గాయపడ్డాడు.

అశ్విన్ భుజానికి గాయం తగిలింది. ఆదివారం  జరిగిన మ్యాచులో అశ్విన్ తొలుత కరుణ్ నాయర్ ను, ఆ తర్వాత నికోలస్ పూరన్ ను అవుట్ చేశాడు. అయితే, సింగిల్ ను ఆపే క్రమంలో అశ్విన్ ఎడమ భుజానికి తీవ్రమైన గాయమైంది. 

 

గాయంతో బాధపడుతూ అశ్విన్ జట్టు ఫిజియో పాట్రిక్ ఫర్హహర్ట్ తో కలిసి మైదానం నుంచి వెళ్లిపోయాడు. భుజానికి తగిలిన గాయం వల్ల అశ్విన్ ఈ టోర్నమెంటుకు దూరమయ్యే అవకాశం ఉంది. గత సీజన్ లో అశ్విన్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఆడాడు.

ఆదివారం ఉత్కంఠగా మారిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ ఓవరులో రబడ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్ ఓవర్ లో అతను కెఎల్ రాహుల్, నికోలస్ పూరన్ లను అవుట్ చేశాడు. వికెట్ నష్టపోకుండా మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఢిల్లీ విజయం సాధించింది.