ఐపీఎల్‌లో అత్యంత భీకర బౌలింగ్‌ విభాగాలున్న జట్లు అనగానే ముందు ముంబయి ఇండియన్స్‌, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ గుర్తుకొస్తాయి. కానీ ఆ రెండు జట్ల బౌలింగ్‌ లైనప్‌లకు సాధ్యం కాని ఘనతలను ఓ జట్టు సొంతం చేసుకుంది. 

బౌలింగ్‌ దళంలో స్టార్స్‌ ఎవరూ లేకపోయినా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్వితీయ ప్రదర్శన చేస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్కసారి మాత్రమే 150 ప్లస్‌ పరుగులను ఇచ్చింది. 

ఎలిమినేటర్‌లో బెంగళూర్‌ను 132/4కు, ముంబయి ఇండియన్స్‌ను 149/8కు, బెంగళూర్‌ను 120/7కు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు 131/10కు, పంజాబ్‌ను 126/7కు పరిమితం చేశారు. ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయంతో దూరమైనా.. ఆ లోటు లేకుండా దూసుకుపోతుంది సన్‌రైజర్స్‌. 

రషీద్‌ ఖాన్‌ హైదరాబాద్‌ వికెట్ల వేటను ముందుండి నడిపిస్తున్నాడు. ఢిల్లీపై సీజన్‌లో రెండు మ్యాచుల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. సీజన్‌లో ఓవరాల్‌గా 19 వికెట్లు తీసుకున్నాడు. సందీప్‌ శర్మ పవర్‌ ప్లేలోనే ప్రత్యర్థులపై పంజా విసురుతున్నాడు. నటరాజన్‌ యార్కర్లతో పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. 

మిచెల్‌ మార్ష్‌ గాయంతో ప్రత్యామ్నాయ ఆటగాడిగా వచ్చిన జేసన్‌ హోల్డర్‌ సన్‌రైజర్స్‌ శిబిరంలో మ్యాచ్‌ విన్నర్‌గా ఎదిగాడు. ఆరు మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టిన జేసన్‌ హోల్డర్‌, బ్యాట్‌తోనూ అండగా నిలుస్తున్నాడు. 

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌, అరివీర విధ్వంసకారులు కలిగిన ముంబయి ఇండియన్స్‌ సైతం సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ వాడివేడి ముందు తలొంచింది. నేడు క్వాలిఫయర్‌2లోనూ ఆరెంజ్‌ ఆర్మీ బుల్లెట్లు అదే దూకుడు ప్రదర్శిస్తే.. మంగళవారం టైటిల్‌ పోరుకు చేరుకోవటం లాంఛనమే.