Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించేందుకు ఢిల్లీ ఎదురు చూపులు, అడ్డుగోడగా ముంబై..!

ముంబయి, ఢిల్లీలు టాప్‌-2లో నిలిచాయి. నేడు క్వాలిఫయర్‌ 1లో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్లోకి ప్రవేశించనుంది. ఓడిన జట్టు ఫైనల్స్‌కు చేరుకునేందుకు మరో అవకాశం క్వాలిఫయర్‌2 రూపంలో లభించనుంది. 

IPL 2020 Qualifier 1 Mumbai Indians VS Delhi Capitals Match Preview, Playing XI, Dream 11 Predictions
Author
Dubai - United Arab Emirates, First Published Nov 5, 2020, 1:14 PM IST

పాయింట్ల పట్టికలో టాప్‌-2లో నిలువటం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కాదు. కానీ 13 ఏండ్ల ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా ఫైనల్లోకి ప్రవేశించని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. లీగ్‌ దశలో మెరుగైనా ప్రదర్శన చేసినా.. ఏనాడూ టైటిల్‌ పోరు వరకూ వెళ్లలేదు. 

బయో బబుల్‌ ఐపీఎల్‌లో మరోసారి మెరిసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలిసారి ఫైనల్లోకి చేరుకునేందుకు చూస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ చారిత్రక ఫైనల్స్‌ దారిలో.. ముంబయి ఇండియన్స్‌ అడ్డుగా నిలువనుంది. 

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. మానసికంగానూ రోహిత్‌ జట్టుదే పైచేయి. అయినా, ఆశ్చర్యపరచటంలో ఐపీఎల్‌ ఎన్నడూ నిరాశపరచలేదు. మరి నేడు క్వాలిఫయర్‌1లో గెలిచి ఫైనల్స్‌కు చేరేదెవరో చూడాలి. 

ఐపీఎల్‌ 2020 లీగ్‌ దశలో ప్రథమార్థం ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆధిపత్యం సుస్పష్టం. కానీ ద్వితీయార్థంలో ముంబయి ఇండియన్స్‌ జోరు కొనసాగినా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒడిదొడుకులు ఎదుర్కొంది. రోహిత్‌ జట్టు దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఖరు మ్యాచ్‌ వరకూ నిరీక్షించాల్సి వచ్చింది. 

ప్లే ఆఫ్స్‌కు ఎవరెలా చేరుకున్నా, ఓవరాల్‌గా ముంబయి, ఢిల్లీలు టాప్‌-2లో నిలిచాయి. నేడు క్వాలిఫయర్‌ 1లో ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్లోకి ప్రవేశించనుంది. ఓడిన జట్టు ఫైనల్స్‌కు చేరుకునేందుకు మరో అవకాశం క్వాలిఫయర్‌2 రూపంలో లభించనుంది. 

ఈ సీజన్‌ లీగ్‌ దశలో ముంబయి ఇండియన్స్‌ చేతిలో రెండు సార్లు పరాజయం పాలైన ఢిల్లీ క్యాపిటల్స్‌ మానసికంగా వెనుకంజలో నిలువగా.. దుబాయి స్టేడియంలో చెత్త రికార్డు ముంబయి ఇండియన్స్‌ను సైతం వెంటాడే ప్రమాదం కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ క్వాలిఫయర్‌1 పోరు నేడు దుబారులో రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. 

ముంబయికి ఎదురుందా? : 

లీగ్‌ దశ ఆఖరు మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఓడినా.. ఈ సీజన్‌లో అత్యంత నిలకడగా రాణించిన జట్టు ముంబయి ఇండియన్స్‌. అన్ని రంగాల్లోనూ ముంబయి ఇండియన్స్‌ ప్రమాదకరంగానే కనిపిస్తోంది. ధనాధన్‌ బ్యాటింగ్‌ లైనప్‌, నిప్పులు చెరిగే బౌలింగ్‌ దళం ముంబయి సొంతం. 

ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌, రోహిత్‌ శర్మ మొదలుకొని సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. డెత్‌ ఓవర్లలో హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ దాడి నుంచి తప్పించుకోవటం ఎంతటి బౌలింగ్‌ బృందానికైనా కష్టమైన పని. 

 

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న స్టార్‌ పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌లు నేడు రెట్టించిన ఉత్సాహంతో జట్టులోకి రానున్నారు. జేమ్స్‌ పాటిన్సన్‌, రాహల్‌ చాహర్‌లతో బుమ్రా, బౌల్ట్‌ మ్యాజిక్‌ను అడ్డుకోవటం ఢిల్లీ క్యాపిటల్స్‌కు శక్తికి మించిన పనే అవుతుంది. 

లీగ్‌ దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రెండుసార్లు ఓడించిన అనుకూలతతో రోహిత్‌సేన నేడు మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ దుబాయిలో ఆడిన మ్యాచుల్లో ముంబయికి చెత్త రికార్డుంది. ఇక్కడ ఒకే ఒక్క మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది.

 

చరిత్ర వేటలో క్యాపిటల్స్‌ : 

ముంబయి తర్వాత ఈ సీజన్‌లో మెప్పించిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. కానీ లీగ్‌ దశ ఆఖర్లో అయ్యర్‌ సేన లయ కోల్పోయింది. బ్యాటింగ్‌ లైనప్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌ బాధ్యత విస్మరించగా.. బౌలింగ్‌ దాడిలో పస తగ్గింది. 

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటివరకూ ఫైనల్స్‌కు చేరలేదు. ఈ సీజన్‌తో ఆ చెత్త రికార్డుకు చెరమగీతం పాడాలని చూస్తోంది ఢిల్లీ. టాప్‌ ఆర్డర్‌లో పృథ్వీ షా అంచనాలను అందుకోవటం లేదు. ఆరంభంలోనే నాణ్యమైన పేస్‌కు పడిపోతున్నాడు. 

రెండు సెంచరీల హీరో శిఖర్‌ ధావన్‌ ఢిల్లీ బాధ్యతలను తీసుకోవాలి. సీజన్‌లో ఇప్పటివరకు పేలని గన్‌ రిషబ్‌ పంత్‌పై ఢిల్లీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కీలక క్వాలిఫయర్‌లోనైనా పంత్‌ తనదైన ఇన్నింగ్స్‌ ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆశగా ఎదురుచూస్తోంది. 

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, అజింక్య రహానెలు మిడిల్‌ ఆర్డర్‌లో కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ మళ్లీ హీరోయిక్స్‌ చూపిస్తే.. ఢిల్లీకి తిరుగుండదు. సీజన్‌లో విశేషంగా రాణించిన కగిసో రబాడ, నోర్క్య నేడు బలమైన ముంబయి బ్యాటింగ్‌ లైనప్‌ను ఏ విధంగా నిలువరిస్తుందో చూడాలి. స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు నెమ్మదించిన దుబాయి పిచ్‌పై ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కాగలరు.

 

క్వాలిఫయర్‌ ఎక్స్‌ఫ్యాక్టర్‌ :

 1. 2019 ఐపీఎల్‌ నుంచి పవర్‌ ప్లేలో రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌లకు స్పిన్‌కు మంచి రికార్డు లేదు. స్పిన్‌పై పవర్‌ ప్లేలో రోహిత్‌ స్ట్రయిక్‌రేట్‌ 90 కాగా, డికాక్‌ది 93. ముంబయి పవర్‌ప్లేలో రోహిత్‌, డికాక్‌లకు అడ్డుకట్ట వేసేందుకు క్యాపిటల్స్‌ స్పిన్‌ను ప్రయోగించనుంది. డికాక్‌ను అశ్విన్‌ ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు అవుట్‌ చేశాడు. 

2. టీ20 క్రికెట్‌లో శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌లు జస్ప్రీత్‌ బుమ్రాపై 134.75 స్ట్రయిక్‌రేట్‌తో 159 పరుగులు చేశాడు. ఈ ముగ్గురిలో ఎవరూ బుమ్రాకు వికెట్‌ కోల్పోలేదు. కానీ రిషబ్‌ పంత్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌లు బుమ్రాపై 12కంటే తక్కువ స్ట్రయిక్‌రేటు కలిగి ఉన్నారు. దీంతో పవర్‌ ప్లేలో బుమ్రాను ప్రయోగించకుండా.. మిడిల్‌, డెత్‌ ఓవర్ల కోసం అట్టిపెట్టుకోవటం మేలు. తొలి ఆరు ఓవర్లలో బౌల్ట్‌ను ప్రయోగిస్తే ఫలితం ఉంటుంది. 

వ్యూహంలో ఇవి కీలకం! :

 1. ఐపీఎల్‌ 2020లో దుబాయి గణాంకాలు ఆసక్తికరం. ఇక్కడ జరిగిన 24 మ్యాచుల్లో 15 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 171. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

2. ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ విభాగాలు ముంబయి, ఢిల్లీలవే. ముంబయి పేసర్లు 60 వికెట్లు పడగొట్టగా.. ఢిల్లీ పేసర్లు 59 వికెట్లు తీసుకున్నారు. ఈ రెండు జట్లు మాత్రమే డెత్‌ ఓవర్లలో (16-20) పదికంటే తక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చాయి. డెత్‌ ఓవర్లలో 12కు పైగా రన్‌రేట్‌తో పరుగులు చేసే ముంబయి ఇండియన్స్‌ను నేడు రబాడ, నోర్క్యల‌ బృందం ఎలా ఆపుతుందో ఆసక్తికరం.

తుది జట్లు (అంచనా) : 

ఢిల్లీ క్యాపిటల్స్‌ : పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, డానియల్‌ శామ్స్‌, కగిసో రబాడ, నోర్క్య

ముంబయి ఇండియన్స్‌ : క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, జేమ్స్‌ పాటిన్సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.

Follow Us:
Download App:
  • android
  • ios