Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ నిర్వహణపై రాని స్పష్టత, సమావేశం తరువాతైనా వచ్చేనా..?

యుఏఈలో ఐపీఎల్‌ నిర్వహణకు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి పది రోజులు గడుస్తున్నా.. ఎటువంటి సమాధానం లేదు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నేడు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు కీలకాంశంగా మారాయి.

IPL 2020: Franchises seek clarity as Governing Council meets
Author
Mumbai, First Published Aug 2, 2020, 1:42 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లో షరవేగంగా విజృంభిస్తోంది. కేసుల రెట్టింపునకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతోంది. రోజువారీ కేసులు 50000 పైచిలుకు నమోదు అవుతున్నాయి. 8 జట్లు, 300పైచిలుకు క్రికెటర్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్‌ అధికారులు, ప్రసారదారు సిబ్బంది, ప్రాంఛైజీ అధికారులు, లాజిస్టికల్‌ బృందం, మైదాన సిబ్బందితో కలిపి సుమారు 1200 మందితో 8 బయో సెక్యూర్‌ బబుల్స్‌ ఏర్పాటు చేయటం భారత్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యపడదు. 

కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో ఓ మేరకు విజయవంతమైన యుఏఈలో ఐపీఎల్‌ 2020 నిర్వహణకు బీసీసీఐ ఇదివరకే పనులు ప్రారంభించింది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)తో ఐపీఎల్‌ నిర్వహణకు ఆసక్తి వ్యక్తపరుస్తూ లేఖను సైతం పంపించింది. యుఏఈలో ఐపీఎల్‌ నిర్వహణకు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి పది రోజులు గడుస్తున్నా.. ఎటువంటి సమాధానం లేదు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నేడు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు కీలకాంశంగా మారాయి.

స్పష్టత కరువు... 

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేసే వరకు నిరీక్షించిన బీసీసీఐ.. వెంటనే ఐపీఎల్‌ నిర్వహణకు పావులు కదిపింది. గతంలోనే ఆసక్తి వ్యక్తపరిచిన ఈసీబీకి పచ్చజెండా ఊపేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేనిదే అధికారికంగా ఏమీ చేయడానికి లేదు. 

ఐపీఎల్‌ విండోను ప్రకటించినా.. పూర్తి షెడ్యూల్‌ విడుదలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అనుమతి రాకపోవటంతో ఈసీబీతో స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్స్‌పై చర్చించేందుకు, పూర్తి స్థాయి నిర్వహణ ఒప్పందానికి బ్రేక్‌ పడింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన తర్వాత, ఈసీబీ సైతం యుఏఈ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. 

ఆగస్టు మూడో వారంలోనే యుఏఈకి చేరుకునేందుకు ప్రాంఛైజీలు ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఈ దిశగా ఆలోచిస్తే బీసీసీఐకి తక్కువ సమయమే ఉంది. ' కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఈ వారాంతానికి వస్తాయని అనుకుంటున్నాం. 

ప్రభుత్వ గ్రీన్‌ సిగల్‌కు మరో 3-4 రోజులు పట్టనుంది. ఐపీఎల్‌ను యుఏఈకి తరలించటం ఓ భారీ క్రతువు. పూర్తి లాజిస్టికల్‌ అంశాలను ప్రణాళిక చేసుకోవాలి. ప్రతి రోజు సవాల్‌తో కూడుకున్నదే. త్వరలోనే అనుమతులు వస్తాయనే నమ్మకం ఉంది' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నేడు వర్చువల్‌ సమావేశం కానుంది. స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రోసీజర్స్‌ ఖరారు, కోవిడ్‌19 పరీక్షల నిర్వహణ బాధ్యత, బయో సెక్యూర్‌ బబుల్‌ ప్రోటోకాల్‌, లీగ్‌ మధ్యలో ప్రత్నామ్నాయ ఆటగాళ్లను ఎంచుకున్నప్పుడు అనుసరించాల్సిన నిబంధనలు, బయో బబుల్‌లో క్రికెటర్ల కుటుంబ సభ్యులకు అనుమతిపై స్పష్టత, బబుల్‌లో ఉండాల్సిన గరిష్ట ఆటగాళ్ల సంఖ్య, యుఏఈలో ప్రాంఛైజీల ఆతిథ్య నగరం, హౌటల్‌ గదుల బుకింగ్‌, హౌటళ్లలో భౌతిక దూరం సాధ్యాసాధ్యాలు, మూడు నగరాల (దుబారు, షార్జా, అబుదాబి) మధ్య ప్రయాణం, క్రికెటర్ల ప్రాక్టీస్‌కు నెట్‌ సౌకర్యాలు, నెట్‌ బౌలర్ల లభ్యత వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు నేడు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం అవుతోంది. 

ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ అధ్యక్షతన జరుగనున్న సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌ కుమార్‌ ధుమాల్‌, సంయుక్త కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఐపీఎల్‌ సీఓఓ, బీసీసీఐ తాత్కాలిక సీఈఓ హేమంగ్‌ ఆమీన్‌లు హాజరు కానున్నారు.

అనుమతుల కోసం నిరీక్షణ.... 

కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాకుండా, ఐపీఎల్‌ జీసీ సమావేశంపై స్పష్టత కొరవడింది. ప్రభుత్వ అనుమతి తర్వాతే సమావేశం ఉంటుందని సోమవారం కోశాధికారి అరుణ్‌ కుమార్‌ ధుమాల్‌ అన్నారు. 

' మేము ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తాం. ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. అది రాగానే, ఐపీఎల్‌ జీసీ సమావేశమవుతుంది. అనుమతులు వచ్చిన వెంటనే సమావేశం ఏర్పాటు చేస్తాం' అని అరుణ్‌ అన్నారు. మరి, ఇప్పుడు అనుమతుల కోసం ఎదురుచూస్తారా? అనుమతులు వస్తాయనే ఆశాభావంతో నిర్వహణ వ్యూహంపై చర్చిస్తారా? అనేది ఆసక్తికరం. ఐపీఎల్‌ షెడ్యూల్‌పై ప్రాంఛైజీలకు ఎటువంటి సమాచారం లేదు. 

ప్రాంఛైజీలు సొంతంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి. కరోనా కష్టకాలంలో ప్రాంఛైజీలకు స్పాన్సర్ల సమస్య తలెత్తుతోంది. ముందుకొస్తున్న స్పాన్సర్లకు సైతం కచ్చితమైన సమాచారం అందించే స్థితిలో ప్రాంఛైజీలు లేవు. దీంతో ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ప్రభుత్వ అనుమతులు ఆలస్యంగానైనా వస్తాయనే ఆశాభావం బీసీసీఐ వర్గాల్లో కనిపిస్తోంది. బోర్డు కార్యదర్శి జై షా తండ్రి అమిత్‌ షా, కోశాధికారి అరుణ్‌ కుమార్‌ ధుమాల్‌ సోదరుడు అనురాగ్‌ ఠాగూర్‌ కేంద్ర కేబినెట్‌లో కీలక స్థానాల్లో ఉన్నారు. దీంతో అనుమతులపై బోర్డు వర్గాల్లో పెద్దగా ఆందోళన కనిపించటం లేదు. 

కానీ ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు, స్పాన్సర్లకు నమ్మకం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, ఐపీఎల్‌ పూర్తి స్థాయి షెడ్యూల్‌ కీలకం. బీసీసీఐ నాయకత్వం ఈ విషయాన్ని ఎంత త్వరగా తేల్చుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios