ఐపీఎల్ సందడి మొదలైంది.  తొలిరోజు చెన్నై సూపర్ కింగ్స్ దంచి కొట్టగా.. నిన్నటి మ్యాచ్ లో ఢిల్లీ సూపర్ డూపర్ విజయం సాధించింది. ఢిల్లీ కేపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరులో చివరి వరకు విజయం ఎవరికి దక్కుతుందో తెలీక ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. చివరకు ఓడిపోతుందనుకున్న ఢిల్లీ విజయం సాధించింది.

తొలుత టాస్ గెలిచిన పంజాబ్ వ్యూహాత్మకంగా ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. క్రీజులోకి వచ్చిన ఢిల్లీ ఆటగాళ్లు పంజాబ్ బౌలర్ల దెబ్బకు విలవిలాడిపోయారు. క్రీజులో కుదురుకునేందుకు నానా తంటాలు పడ్డారు. అలాంటి ఢిల్లీ ఆటగాళ్లు.. సూపర్ ఓవర్ లో అనూహ్యంగా విజయం సాధించారు.

అప్పటివరకు చెలరేగిపోయిన పంజాబ్ జట్టు.. చివరల్లో బోల్తా పడింది. చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన పంజాబ్ రెండు వికెట్లు చేజార్చుకుంది. చివరి బంతికి మయాంక్ అవుట్ కావడంతో పంజాబ్ కథ ముగిసింది. మ్యాచ్ టైగ్ ముగిసింది. మ్యాచ్ విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ అవసరం అయ్యింది. ఈ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ .. రబడ బౌలింగ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి.. రెండు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ కేపిటల్స్ మాత్రం రెండు బంతుల్లోనే మూడు పరుగుల లక్ష్యాన్ని చేధించిన విజయాన్ని అందుకుంది.

కాగా.. రబడ బౌలింగ్ మాయాజాలం కారణంగానే విజయం దక్కిందని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు.ఢిల్లీ అందుకున్న విజయం పట్ల శ్రేయాస్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ కి కీలక సమయంలో సరిగా బౌలింగ్ చేసిన  రబడపై శ్రేయాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ లోనూ తమకు ఇలాంటి అనుభవం ఎదురైందని శ్రేయాస్ చెప్పడం గమనార్హం. 

ఇదిలా ఉండగా.. రవి చంద్రన్ అశ్విన్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తదుపరి మ్యాచ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అశ్విన్ తాను తదుపరి మ్యాచ్ లో పాల్గొంటానని చెప్పడం గమనార్హం. కాగా.. ఫిజియో చెక్ చేసి ఆరోగ్యం కుదుటపడిందని చెప్పిన తర్వాతే తిరిగి రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని శ్రేయాస్ తెలిపాడు.