భారత క్రికెట్‌కి దూకుడు మంత్రాన్ని పరిచయం చేసిన కెప్టెన్ ‘బెంగాల్ టైగర్’ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న ‘దాదా’ కారణంగానే కరోనా నేపథ్యంలోనూ ఐపీఎల్‌ నిర్వహణ జరుగుతోంది. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే ఉండడంతో దుబాయ్ చేరిన గంగూలీ, అక్కడి ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


తాజాగా ఐపీఎల్ ఛైర్మెన్ బ్రిజేష్ పటేల్, సీవోవో హేమంగ్ అమిన్‌తో కలిసి షార్జా స్టేడియాన్ని సందర్శించాడు గంగూలీ. తన ఇన్‌స్టాలో ఈ ఫోటోలను షేర్ చేసిన గంగూలీ, ‘షార్జా స్టేడియం అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడ నాకెన్నో మధుర స్మృతులు ఉన్నాయి. షార్జా స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు వేచి చూస్తున్నా...’ అంటూ పోస్టు చేశారు.

షార్జా స్టేడియంలో ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో కలిపి 700 పరుగులకు పైగా సాధించిన గంగూలీ, సచిన్, సెహ్వాగ్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలు కూడా నెలకొల్పారు.