ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. ఇప్పటికే దిగ్విజయంగా మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రెండో మ్యాచ్ ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం సాధించగా.. ఇక సోమవారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దంచి కొట్టింది. ఆర్సీబీ స్పీడ్ ని  సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చేయలేక డీలా పడిపోయింది.

కాగా.. ఈ నిన్నటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ దంచి కొట్టాడు. ఈ మ్యాచ్ తో సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరపున ఆడి 200 సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి తాజాగా దక్షిణ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ చేరాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో కేవలం క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. 

గేల్ ఆర్‌సీబీ టీంలో ఉన్నప్పుడు మొత్తం 239 సిక్సులు బాదాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌తో ఏబీ డెవిలియర్స్ కూడా 200 సిక్సులు పూర్తిచేసి ఈ జాబితాలోకి వచ్చేశాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డెవిలియర్స్ 30 బంతుల్లో 51 పరుగులు(రెండు సిక్సులు, నాలుగు బౌండరీలు) చేశాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక గేల్, డెవిలియర్స్ తర్వాత 190 సిక్సులతో విరాట్ కోహ్లీ 200 సిక్సుల చేరువలో ఉన్నాడు.