గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఐపీఎల్  హంగామా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట బిసిసిఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపిఎల్ మెగా ఈవెంట్ ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ అభిమానులు కోల్పోయారు. ఇలా తమ రాష్ట్రంలో మ్యాచులేవీ జరక్క ఆంధ్రా అభిమానులు నిట్టూరుస్తున్న సమయంలో బిసిసిఐ వారికి శుభవార్త  అందించింది. ప్లేఆఫ్ లో భాగంగా జరగనున్న ఎలిమినేషన్, క్వాలిఫయర్ 2  మ్యాచ్ లను విశాఖ పట్నం ఆతిథ్యమివ్వనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఏపి అభిమానులు కాస్త ఆలస్యమైన ఐపిఎల్ మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షంచే అవకాశం వచ్చింది. 

ఐపిఎల్  సీజన్ 12 ప్లేఆఫ్ లో భాగంగా మొదటిమ్యాచ్ బుధవారం విశాఖ స్టేడియంలో జరగనుంది.  ఇందులో పాయింట్స్ పట్టికలో 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన డిల్లీ క్యాపిటల్స్, 12 పాయింట్లతో ప్లేఆఫ్ అవకాశాన్ని సాధించిన సన్ రైజర్స్ తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ప్రత్యేక విమానాల్లో విశాఖకు చేరుకుని సాధన  కూడా మొదలుపెట్టాయి. 

8వ తేదీన రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు పాయింట్స్ టేబుల్ లో టాప్ లో  నిలిచిన జట్లతో క్వాలిఫయర్‌ మ్యాచ్ లు ఆడనుంది. క్వాలిఫయర్ 1 చెన్నైలో, క్వాలిఫయర్ 2  మళ్లీ వైజాగ్ లోనే జరగనుంది. ఈ ఎలిమినేషన్  మ్యాచ్ లో ఓడిన జట్టు ఐపిఎల్ నుండి నిష్క్రమిస్తుంది. 

అయితే వైజాగ్ మ్యాచ్ కు ఇరుజట్లలో టాప్  ఆటగాళ్లు దూరమయ్యారు. సన్ రైజర్స్ తరపున అత్యధిక  పరుగులు సాధించిన వార్నర్, బెయిర్ స్టో, డిల్లీ క్యాపిటల్స్ తరపున అత్యధిక వికెట్ల  వీరుడు రబాడ లు ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయారు. కాబట్టి ఈ స్టార్ల మెరుపులు ప్రత్యక్షంగా వీక్షించచే అవకాశాన్ని ఏపి ప్రజలు మిస్సయ్యారు. 

ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన లీగుల్లో భాగంగా డిల్లీ, హైదరాబాద్ లు రెండు మ్యాచుల్లో తలపడ్డాయి. వీటిల్లో  ఇరుజట్లు ఒక్కోమ్యాచ్ గెలిచాయి. ఇలా లీగ్ లో సమఉజ్జీలుగా నిలిచిన జట్లలో  ప్లేఆఫ్ లో ఎవరిది పైచేయిగా  నిలుస్తుందో అభిమానులకు కూడా ఊహించడం కష్టంగా వుంది. కానీ వీటి  మధ్య రసవత్తర పోరు వుంంటుందని  భావిస్తున్నట్లు తెలుగు అభిమానులు చెబుతున్నారు.