Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకి ఊహించని షాక్... న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి హార్ధిక్ పాండ్యా దూరం, నేరుగా అక్కడికే..

న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం ధర్మశాలకు చేరుకున్న టీమిండియా... గాయంతో బెంగళూరుకి హార్ధిక్ పాండ్యా, 29న ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కి... 

injured Hardik Pandya not travelling with team for India vs New Zealand match, BCCI reports CRA
Author
First Published Oct 20, 2023, 3:33 PM IST | Last Updated Oct 20, 2023, 3:33 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. మొదటి నాలుగు మ్యాచుల్లో వరుస విజయాలు అందుకుని జోరు మీదున్న భారత జట్టు, ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ కూడా మొదటి నాలుగు మ్యాచుల్లో విజయాలు అందుకుంది. ఇప్పటిదాకా అజేయంగా ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్‌పై భారీ అంచనాలు పెరిగాయి..

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. ఇప్పటికే హార్ధిక్ పాండ్యా మినహా మిగిలిన ప్లేయర్లు అందరూ న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం ధర్మశాలకు చేరుకున్నారు. 

హార్ధిక్ పాండ్యా మాత్రం పూణే నుంచి బెంగళూరులోకి జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లబోతున్నాడు. అక్కడ చికిత్స తర్వాత నేరుగా అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడు హార్ధిక్ పాండ్యా. న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత వారం రోజుల గ్యాప్‌ దొరకడంతో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ సమయానికి పూర్తిగా కోలుకోవడానికి హార్ధిక్ పాండ్యాకి సమయం దొరికినట్టైంది.. 

ఇప్పటిదాకా జరిగిన మొదటి నాలుగు మ్యాచుల్లో హార్ధిక్ పాండ్యాకి చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ 90ల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా ఓ సిక్సర్ బాది 11 పరుగులు చేశాడు..

బౌలింగ్‌లో 5 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి అందుబాటులో లేకపోవడం టీమిండియాకి పెద్ద లోటే. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు, న్యూజిలాండ్‌పై గెలిచి 20 ఏళ్లు దాటింది. చివరిగా 2003 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచింది టీమిండియా..

ఆ తర్వాత న్యూజిలాండ్‌పై ఒక్క ఐసీసీ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 2019 వన్డే వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ పరాజయాన్నే ఎదుర్కొంది. 2021 ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ భారత జట్టు ఓటమి పాలైంది..

హార్ధిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ లేదా మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios