వరుసగా మూడో సిరీస్‌నూ క్లీన్ స్వీప్ చేసిన నయా సారథి రోహిత్ శర్మ... నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీ పోరాటం వృథా...
కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుస విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో, వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మ, టీ20 సిరీస్‌లోనూ అదే ఫీట్ రిపీట్ చేశాడు. విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని, సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది...
185 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన వెస్టిండీస్‌కి శుభారంభం దక్కలేదు. 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన కేల్ మేయర్స్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
4 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన షై హోప్ కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లోనే ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే షై హోప్ అవుటైన తర్వాత ఒక్క బాల్ మాత్రమే వేసిన దీపక్ చాహార్, బౌలింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో పెవిలియన్ చేరాడు...
26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. ఈ దశలో రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్ కలిసి మూడో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన రోవ్‌మన్ పావెల్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్, వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్‌లో రవి భిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జాసన్ హోల్డర్ 2 పరుగులు చేసి వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...
7 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన రోస్టన్ ఛేజ్, హర్షన్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్... ఈ దశలో పూరన్, రొమారియో షెఫర్డ్ కలిసి 33 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
సిరీస్‌లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నికోలస్ పూరన్, 47 బంతుల్లో 8 ఫోర్లు,ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
18 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన దశలో 18వ ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి పూరన్ వికెట్ తీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 21 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసిన రొమారియో షెఫర్డ్‌ను హర్షల్ పటేల్ అవుట్ చేశాడు... 19వ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు హర్షల్ పటేల్...
ఆఖరి ఓవర్‌లో విండీస్ విజయానికి 23 పరుగులు కావాల్సి రాగా శార్దూల్ ఠాకూర్ మూడో బంతికే డొమినిక్ డ్రాక్స్‌ని అవుట్ చేయడంతో భారత జట్టు విజయం ఖాయమైపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకి పరిమితమైంది వెస్టిండీస్.
