India vs Sri Lanka 3rd T20I: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక... నాలుగు మార్పులతో బరిలో భారత జట్టు...

INDvsSL 3rd T20I: భారత జట్టుతో జరుగుతున్న మూడో, ఆఖరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక, భారీ స్కోరు చేయడంతో దాన్ని కొనసాగించాలని ఆశిస్తోంది... లక్నోలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కనీస పోరాటం కూడా చూపించకుండానే చేతులు ఎత్తేసిన శ్రీలంక జట్టు, ధర్మశాలలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బ్యాటుతో అదరగొట్టి భారత జట్టు ముందు భారీ లక్ష్యాన్ని పెట్టగలిగింది...

అయితే ఓపెనర్ పథుమ్ నిశ్శంక హాఫ్ సెంచరీ, కెప్టెన్ దసున్ శనక మెరుపులతో 183 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేక, సిరీస్‌ను కోల్పోయింది లంక. ఆఖరి టీ20 మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది శ్రీలంక జట్టు...

అయితే వరుసగా మ్యాచులు గెలుస్తూ, రికార్డు ఫామ్‌ను కొనసాగిస్తూ వెళ్తున్న రోహిత్ సేన జోరుకి బ్రేకులు వేయడం అంత తేలికయ్యే పని కాదు. బ్యాటింగ్‌లో రాణించినా, బౌలింగ్ విభాగం నుంచి లంకకి కావాల్సిన సహకారం లభించడం లేదు...

రోహిత్ శర్మకు ఇది 125వ టీ20 మ్యాచ్. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, అత్యధిక పరుగులు చేసిన టీ20 బ్యాటర్‌గానూ టాప్‌లో నిలిచిన విషయం తెలిసిందే.

మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు నాలుగు మార్పులతో బరిలో దిగుతోంది. రెండో టీ20లో గాయపడి జట్టుకి దూరమైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. అలాగే జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్‌కు మూడో టీ20 నుంచి విశ్రాంతి కల్పించిన టీమ్ మేనేజ్‌మెంట్, వారి స్థానంలో కుల్దీప్ యాదవ్, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు అవకాశం ఇచ్చింది. 

వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఆవేశ్ ఖాన్‌కి మరో అవకాశం దక్కింది. అలాగే కొన్నాళ్లుగా రిజర్వు బెంచ్‌కే పరిమితం అవుతున్న మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు కూడా అవకాశం ఇచ్చాడు రోహిత్ శర్మ... 

ఇషాన్ కిషన్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా వస్తాడని ప్రచారం జరిగినా, అది జరగలేదు. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయబోతున్నాడు. రవీంద్ర జడేజా, రవి భిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌ల రూపంలో నేటి మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది భారత జట్టు. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్ 

శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, ధనుష్క గుణతిలక, చరిత్ అసలంక, దినేశ్ చండీమల్, జనిత్ లియనాగే, దసున్ శనక, చమికా కరుణరత్నే, దుస్మంత ఛమీరా, జెఫ్రే వందర్సే, బినురా ఫెర్నాండో, లహిరు కుమార