India vs Sri Lanka 3rd T20I: కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన దసున్ శనక... అదరగొట్టిన ఆవేశ్ ఖాన్...

ఇప్పటికీ మొదటి రెండు టీ20 మ్యాచులు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు, మూడో టీ20లోనూ లంకపై తన ప్రతాపాన్ని చూపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది....

ఓపెనర్ దనుష్క గుణతిలకను తొలి ఓవర్ ఆఖరి బంతికి డకౌట్ చేశాడు మహ్మద్ సిరాజ్. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన పథుమ్ నిస్సంక 10 బంతుల్లోఒక్క పరుగు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

చరిత్ అసలంక 6 బంతుల్లో 4 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా మార్చిన ఆవేశ్ ఖాన్, రెండో ఓవర్‌లో ఒకే పరుగు ఇచ్చి వికెట్ తీయడం విశేషం..

జనిత్ లియనాగే 19 బంతుల్లో 9 పరుగులు చేసి రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్ కీపర్ దినేశ్ చంఢీమన్ 27 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ పట్టిన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు...

60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శ్రీలంక. ఈ దశలో కెప్టెన్ దసున్ శనక మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో లంక మంచి స్కోరు అందించాడు. ఆఖరి ఓవర్లలో హిట్టింగ్‌కి దిగిన దసున్ శనక, ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు రాబట్టాడు... 

హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు రాబట్టాడు దసున్ శనక. గత మ్యాచ్‌లో ఆఖరి 5 ఓవర్లలో 80 పరుగులు రాబట్టిన శ్రీలంక బ్యాటర్లు, నేటి మ్యాచ్‌లో 69 పరుగులు రాబట్టడం విశేషం. 

నాలుగు ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 2 వికెట్లు తీసి 23 పరుగులు సమర్పించాడు ఆవేశ్ ఖాన్. కెప్టెన్ దసున్ శనక 38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేయగా చమికా కరుణరత్నే 19 బంతుల్లో 12 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. ఈ ఇద్దరూ 47 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్ తలా ఓ వికెట్ తీశారు. 8.3 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసిన శ్రీలంక, 146 పరుగుల స్కోరు చేసిందంటే దానికి దసున్ శనక ఇన్నింగ్సే కారణం... పవర్ ప్లేలో కేవలం 18 పరుగులు మాత్రమే సమర్పించి 3 వికెట్లు తీసిన భారత బౌలర్లు, అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. ఇంతకుముందు 2016లో యూఏఈపై పవర్ ప్లేలో 2 వికెట్లు తీసి 21 పరుగులు సమర్పించిన భారత జట్టు, ఆ రికార్డును అధిగమించారు.