పింక్ బాల్ టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసిన టీమిండియా... నిరాశపరిచిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... 

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు 101 టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు. 

మయాంక్ అగర్వాల్ 4 పరుగులు చేసి రనౌట్ కాగా కెప్టెన్ రోహిత్ శర్మ 25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో హనుమ విహారి, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

81 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన హనుమ విహారి, జయవిక్రమ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డిక్‌వాలాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 48 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 

లంచ్ బ్రేక్ సమయానికి 29 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది భారత జట్టు. రిషబ్ పంత్ 9 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులతో, శ్రేయాస్ అయ్యర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 

రెండో టెస్టు హై డ్రామాతో మొదలైంది.భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఓవర్‌లో ఓ చక్కని షాట్‌తో ఫోర్ బాదిన మయాంక్ అగర్వాల్, రెండో ఓవర్‌లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు...

విశ్వ ఫెర్నాండో వేసిన రెండో ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన రోహిత్ శర్మ, మూడో బంతికి సింగిల్ తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ నాలుగో బంతిని ఎదుర్కోవడం, వికెట్ కీపర్, బౌలర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయడం జరిగింది...

ఏం జరుగుతుందో గుర్తించేలోపే మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ రన్‌కి రావాల్సిందిగా పిలవడం, మయాంక్ అగర్వాల్ చూసుకోకుండా ముందుకు వచ్చేయడం... బంతిని అందుకున్న వికెట్ కీపర్ వికెట్లను గీరాటేయడం జరిగిపోయాయి...

అయితే రనౌట్ చేసేందుకు ప్రవీణ్ జయవిక్రమ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ డిక్‌వాల్, వికెట్లను గిరాటేసే ముందు డీఆర్‌ఎస్ కోరుతున్నట్టుగా సిగ్నల్ ఇవ్వడం వివాదాస్పదమైంది. డీఆర్‌ఎస్ కోరుకుంటే, ఆ బంతి డెడ్‌ బాల్‌గా పరిగణించాల్సి ఉంటుంది. డెడ్‌ బాల్‌తో రనౌట్ చేసినా అది చెల్లదు. అలాంటప్పుడు డీఆర్‌ఎస్ కోరుకున్న తర్వాత రనౌట్ ఎలా చేస్తాడు? 

అయితే డీఆర్‌ఎస్ కోరుకున్న తర్వాత అంపైర్, ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ప్రత్యర్థి జట్టు షాక్‌కి గురి అయ్యింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్ డీఆర్ఎస్ తీసుకుంటున్నట్టు సిగ్నల్ ఇస్తేనే... అది లెక్కలోకి వస్తోంది.

వికెట్ కీపర్, బౌలర్ డీఆర్‌ఎస్ తీసుకుంటున్నట్టు సిగ్నల్ ఇచ్చినా, దాన్ని లెక్కలోకి తీసుకోరు. ఈ నిబంధన కారణంగా మయాంక్ అగర్వాల్ రనౌట్ కావాల్సి వచ్చింది. ఒకే బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేయడం, రనౌట్ కావడం, నో బాల్ కావడంతో హై డ్రామా మధ్య బెంగళూరు టెస్టు మొదలైంది...