తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకి టీమిండియా ఆలౌట్... 92 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... పింక్ బాల్ టెస్టులో రెండు సెషన్లలోనే ముగిసిన భారత ఇన్నింగ్స్...
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 59.1 ఓవర్లలో 252 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ పూర్తిగా రెండు సెషన్లు కూడా సాగకపోవడం విశేషం. బ్యాటింగ్‌కి కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై ఎంతో సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేసి,కెరీర్‌లో రెండో టెస్టు హాఫ్ సెంచరీ అందుకున్న శ్రేయాస్ అయ్యర్.. 92 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
అంతకుముందు టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు 101 టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచారు.
మయాంక్ అగర్వాల్ 4 పరుగులు చేసి రనౌట్ కాగా కెప్టెన్ రోహిత్ శర్మ 25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో హనుమ విహారి, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 81 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన హనుమ విహారి, జయవిక్రమ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డిక్‌వాలాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 48 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
లంచ్ బ్రేక్ సమయానికి 29 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది భారత జట్టు. లంచ్ బ్రేక్ తర్వాత 26 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన రిషబ్ పంత్‌ను ఎంబుల్దేనియా క్లీన్ బౌల్డ్ చేశాడు. గత మ్యాచ్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి ఎంబూల్దేనియా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...
33 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 183 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసిన అక్షర్ పటేల్, లక్మల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మహ్మద్ షమీ 5 పరుుగలు చేసి అవుట్ కాగా... శ్రేయాస్ అయ్యర్ 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి జయవిక్రమ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు...
148 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, ఆఖరి నాలుగు వికెట్లకు 104 పరుగులు రాబట్టడం విశేషం. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబూల్డేనియా, ప్రవీణ్ జయవిక్రమ మూడేసి వికెట్లు తీయగా ధనంజయ డి సిల్వ రెండు, సురంగ లక్మల్ ఓ వికెట్ తీశాడు.
రెండో టెస్టు హై డ్రామాతో మొదలైంది.భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఓవర్‌లో ఓ చక్కని షాట్‌తో ఫోర్ బాదిన మయాంక్ అగర్వాల్, రెండో ఓవర్‌లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు...
విశ్వ ఫెర్నాండో వేసిన రెండో ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన రోహిత్ శర్మ, మూడో బంతికి సింగిల్ తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ నాలుగో బంతిని ఎదుర్కోవడం, వికెట్ కీపర్, బౌలర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయడం జరిగింది...
ఏం జరుగుతుందో గుర్తించేలోపే మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ రన్‌కి రావాల్సిందిగా పిలవడం, మయాంక్ అగర్వాల్ చూసుకోకుండా ముందుకు వచ్చేయడం... బంతిని అందుకున్న వికెట్ కీపర్ వికెట్లను గీరాటేయడం జరిగిపోయాయి...
